hyderabad metro charges hike soon
mictv telugu

మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. త్వరలోనే ఛార్జీల పెంపు

January 25, 2023

హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణం చేసేవారికి అలర్ట్. త్వరలోనే ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీలపై ‘ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ’ అధ్యయనం చేస్తోంది.. ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపు ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, విద్యుత్, నిర్వహణ భారం, ఖర్చులు పెరగడంతో మెట్రో చార్జీలను 25 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు హైదరాబాద్ మెట్రో కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రో ప్రయాణ కనీస చార్జీ రూ.10 కాగా, గరిష్టంగా రూ. 60 గా ఉంది. ఇక తాజా పెంపు ప్రతిపాదనలో భాగంగా ఎంత పెంచుతారనేది త్వరలో తేలనుంది.

ఆదాయం పెంచుకోవడంతోపాటు ప్రాజెక్ట్‌ను లాభదాయకంగా మార్చేందుకు మెట్రో వేగంగా అడుగులు వేస్తోంది. కాగా, మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తాన్ని ( రూ.13 వేల కోట్లు) ఎల్‌ అండ్‌ టీ సంస్థనే భరించింది. దీనికి గానూ బ్యాంకుల కన్సార్షియం నుంచి లోన్ తీసుకుంది. అయితే కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌ కారణాల వల్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. తీసుకున్న లోన్ లకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో కమర్షియల్‌ లోన్లను ఎల్‌ అండ్‌ టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి వడ్డీని 9 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించుకుంది. మరోవైపు రూ.3 వేల కోట్ల సాఫ్ట్‌ లోన్‌ ఇచ్చి ఆదుకోవాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సర్కారు సానుకూల స్పందించిందని సమాచారం. ఈ క్రమంలోనే నష్టాలను తగ్గించుకునేందుకు చార్జీలను పెంచనున్నట్లు మెట్రో తెలిపింది.