Hyderabad Metro charges hikes 25 to 30 percent from Next Year
mictv telugu

ప్రయాణికులకు షాక్.. పెరగనున్న మెట్రో ఛార్జీలు?

November 15, 2022

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకొని గమ్య స్థానం చేరాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ మెట్రో. బస్ ఛార్జీలు పెరిగాక చాలామంది సిటిజన్లు… కాస్త ఛార్జీలు ఎక్కువైనా మెట్రో ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. అయితే ప్రయాణికులకు గ్రేటర్‌ మెట్రో త్వరలో షాకివ్వబోతున్నట్లు సమాచారం. చార్జీలను 25 నుంచి 30 శాతం పెంచేందుకు సమాయత్తమవుతున్నారట అధికారులు. మరో షాక్ ఏంటంటే పెరిగిన టికెట్‌ ధరలు.. మరో రెండు నెలల్లో అంటే వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.

మెట్రో చార్జీల పెంపునకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించేందుకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీకి ఈ– మెయిల్‌ ద్వారా సలహాలు పంపించేందుకు విధించిన గడువు నేటితో ముగియనుంది. క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఛార్జీల పెరుగుద‌ల ఉండ‌నుంది. రోజూ ల‌క్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మెట్రో.. ప్రారంభ‌మైన‌ప్పటి నుంచి ఒక‌టే ఛార్జీల‌ు అమ‌లవుతున్నాయి. దీంతో ఛార్జీలను సవరించే తరుణం వచ్చిందంటున్నారు ఎల్ అండ్ టీ అధికారులు.

మెట్రో ఛార్జీలు పెంచడానికి ముఖ్య కారణాలుగా.. నాడు మెట్రో నిర్మాణ పనులు ఆలస్యం కావడం, కోర్టు కేసులు, రాష్ట్ర విభజన, కోవిడ్‌ విజృంభణ, ఆర్థిక మాంద్యం అని చెప్పుకుంటున్నారు. మెట్రో నిర్మాణం సమయంలో ప్రయాణికుల చార్జీల ద్వారా 45 శాతం.. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా సమకూర్చుకోవడం, మరో 5 శాతం వాణిజ్య ప్రకటనల రూపంలో ఆదాయ ఆర్జన చేయాలని నిర్మాణ సంస్థ నిర్దేశించుకుంది. నగరం నడిబొడ్డున పలు చోట్ల సుమారు 269 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాలను 60 ఏళ్లపాటు సంస్థకు సర్కారు కేటాయించింది. ఈ స్థలాలను అభివృద్ధి చేసి ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టే విషయంలోనూ సంస్థ చతికిలపడింది.