మెట్రోలో ముసలం.. 100 మంది ఉద్యోగులు ఇంటికి.. - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రోలో ముసలం.. 100 మంది ఉద్యోగులు ఇంటికి..

February 2, 2018

ప్రారంభమై గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా ఒకేసారి 100 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. దీనిపై బాధితులు రోడ్డెక్కారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఎలాంటి నోటిసులూ, ముందస్తు సమాచారం ఇవ్వకుండా రోడ్డున పడేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వీరంతా వివిధ మెట్రో స్టేషన్లలో అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ట్రిగ్ అనే సంస్థ తమనుంచి ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష రూపాయలు తీసుకుని, ఉద్యోగాలు ఇచ్చిందని, తాము చక్కగా విధులు నిర్వహిస్తున్నా ఇలా చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం తమకు ముందుగానే నోటీసులు ఇవ్వాల్సి ఉందని, ఉన్నపాటున తీసేస్తే వేరే ఉద్యోగాన్ని వెంటనే ఎలా సంపాదించుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 30 కి.మీ. ఉన్న మెట్రో తొలిదశను ప్రధాని మోదీ నవంబర్ 28న ప్రారంభించడం తెలిసిందే. ప్రస్తుతం నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రో బండ్లు నడుస్తున్నాయి.