హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పూనుకున్నారు. నేడు సగం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. హైద్రాబాద్ మెట్రోలోని టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ నుండి మియాపూర్ లైన్ లో టికెట్ కౌంటర్లలో సుమారు 300 మంది విధులు నిర్వహించాలి. కానీ ఇవాళ 150 మంది మాత్రమే విధులకు హాజరైనట్టుగా సమాచారం. ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపై ఎఫెక్ట్ పడింది. రెడ్ లైన్ – మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఎస్ ఆర్ నగర్ మెట్రో స్టేషన్లో ధర్నా చేస్తున్నారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా 11 వేల రూపాయల సాలరీ మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. ఐదేళ్లుగా తమ వేతనాలు కూడా పెంచలేదని కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.