హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో రైలు ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో రైలు ప్రారంభం

November 29, 2019

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభమై ఈరోజుకి సరిగ్గా రెండేళ్లు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో రికార్డులను సాధించింది. మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాక హైదరాబాద్‌ ప్రజల ప్రయాణం సులభతరం అయింది. రోజు రోజుకూ మెట్రోరైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. మెట్రో రైలు ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో రూట్‌లో హైటెక్‌సిటీ – రాయదుర్గం మధ్య సర్వీస్‌ ఈరోజు ప్రారంభమైనది. మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌ నుంచి ఉదయం జెండా ఊపి దీనిని ప్రారంభించారు. 1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి.. అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మెట్రో ఉన్నతాధిరులు పాల్గొన్నారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు. కారిడార్-3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా మరో 1.5 కి.మీ. మార్గం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. 

ఇదిలా వుండగా పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ (పిపిపి) పద్దతిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రికార్డు సాధించింది. దేశంలోనే ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ (56 కి.మీ.) కలిగి ఉన్న ప్రాజెక్టుగా కూడా హైదరాబాద్‌ మెట్రో పేరు సంపాదించుకుంది. రోజుకు 4లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రోజుకు 18వేల కి.మీ.ల ప్రయాణంలో 780 ట్రిప్పులు చేస్తోంది. గత రెండు సంవత్సరాల కాలంలో 12.5 కోట్ల మంది మెట్రోలో ప్రయాణించారు. రెండేళ్లలో 4.1లక్షల ట్రిప్పులతో 86 లక్షల కి.మీ. ప్రయాణించిన ఘనతను మెట్రో దక్కించుకుంది.