మెట్రో గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా టిక్కెట్ బుకింగ్.. ఇలా చేసుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

మెట్రో గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా టిక్కెట్ బుకింగ్.. ఇలా చేసుకోండి

October 3, 2022

హైదరాబాద్ నగరంలో అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రమాణాలతో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న మెట్రో సంస్థ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకునే సదుయాన్ని కల్పించింది. దీనిని ఎల్ అండ్ టీ హైద్రాబాద్ మెట్రో రైలు సీఈవో, ఎండీ కేవీబీ రెడ్డి లాంఛనంగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఇలాంటి సేవలను ప్రారంభించిన తొలి మెట్రో రైలు సంస్థగా రికార్డు నెలకొల్పామని తెలిపారు.

బిల్ ఈజీ సంస్థ భాగస్వామ్యంతో వాట్సాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకునేలా సేవలను ప్రారంభించామని వివరించారు. కాగా, వాట్సాప్ ద్వారా టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ముందుగా, 8341146468 నంబరును సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ పెట్టాలి. వెంటనే ఒక సందేశంతో లింకు వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే (https://hyd.billeasy.in) అనే లింకు ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ప్రయాణం చేసే మార్గం చూపిస్తుంది. అందులో ఏ స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించి ఎక్కడ దిగుతారో నమోదు చేయాలి. ఆ తర్వాత టిక్కెట్ ఒక్కరి కోసమా, తిరుగు ప్రయాణమా అని అడుగుతుంది. దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత చెల్లించాల్సిన డబ్బును చూపిస్తూ ప్రొసీడ్ బటన్ బ్లూ కలర్ చూపిస్తుంది. దాన్ని ప్రెస్ చేయగానే పే నౌ బటన్ వస్తుంది. అక్కడ నుంచి యూపీఐ, లేదా ఇతర అకౌంట్ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత క్యూ ఆర్ కోడ్‌తో కూడిన టిక్కెట్ వస్తుంది. దాన్ని స్టేషన్లలో ఎంట్రీ గేటు వద్ద రీడర్ ముందు చూపిస్తే లోపలకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.