వరుసగా రెండో రోజూ విధులు బహిష్కరించిన మెట్రో టికెటింగ్ స్టాఫ్
హైదరాబాద్లో వరుసగా రెండోరోజు మెట్రో టికెటింగ్ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హఠాత్తుగా విధులు బహిష్కరించిన ఉద్యోగులు ఇవాళ కూడా నాగోల్ మెట్రో ఆఫీస్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం సిబ్బంది ఆందోళనతో మెట్రో కియోలిస్ సబ్ ఏజెన్సీ నిర్వాహకులు వారితో.. అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో చర్చలు జరిపారు. దాంతో తాత్కాలికంగా ధర్నా విరమిస్తున్నట్లు ప్రకటించారు. జీతాల పెంపుపై ఉన్నతాధికారులతో చర్చించి చెబుతామన్న కియోలిస్ ప్రతినిధులు చెప్పగా.. స్పష్టమైన హామీ వచ్చేవరకు.. విధులకు మాత్రం హాజరుకామని స్పష్టం చేశారు.
మరోవైపు టికెటింగ్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ కియోలిస్ ప్రతినిధులు అంటున్నారు. ట్రైన్ ఆపరేషన్ నిలిపివేసేందుకే సిబ్బంది విధుల్లోకి రాలేదన్నారు. సమయం ప్రకారమే మెట్రో రైళ్లు నడుస్తున్నాయని చెప్పారు. ధర్నా చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. చర్చలు జరుపుతామని హామీ ఇచ్చినా టికెటింగ్ స్టాఫ్ ఆందోళన కొనసాగించారని చెప్పారు. అయితే మెట్రో ప్రయాణికులు టికెట్ల కోసం ఇబ్బంది పడకుండా.. ఇతర డిపార్ట్‌మెంట్‌లలోని మెయింటైనర్లను, ట్రైనీల చేత ఆయా మెట్రో స్టేషన్‌లలో టికెట్లు పంపిణీ చేయిస్తోంది కియోలిస్ సంస్థ.