Hyderabad metro ticketing staff to hold massive protest in Ameerpet
mictv telugu

భారీ నిరసన చేపట్టనున్న హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది

January 5, 2023

జీతాల పెంపు విషయమై హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది గత రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్‌లపై కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో.. నేడు భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాలో 450 మందికి పైగా మెట్రో సిబ్బంది పాల్గొననున్నారు. వీరికి సంఘీభావంగా మిగతా కారిడార్లలో టికెటింగ్ సిబ్బంది కూడా ధర్నా చేయనున్నారు.

2 రోజులుగా ఎల్‌బీనగర్- మియాపూర్ కారిడార్లలో విధులకు హాజరుకాకుండా ధర్నా చేస్తున్నారు సిబ్బంది. బుధవారం కూడా విధులకు హాజరు కాకుండా నాగోల్ మెట్రో డిపో వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బంది ధర్నాతో ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని భావించి సిబ్బందిలో పదిమందిని ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌(ఓసీసీ)లోకి చర్చలకు ఆహ్వానించింది యాజమాన్యం. సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీ సంస్థ, కియోలిస్‌, ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు టికెటింగ్‌ సిబ్బందితో చర్చలు జరిపారు. అయితే యాజమాన్యం నుంచి స్పష్టమైన వివరాలేవీ రాకపోవడంతో.. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే మిగతా కారిడార్లలోని టికెటింగ్‌ సిబ్బందితో కలిసి పోరాడుతామని చెప్పారు సిబ్బంది.