Hyderabad Metro to extend train services during Ganesh immersion
mictv telugu

నేడు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు

September 9, 2022

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్‌ నిమజ్జనోత్సవం ఘనంగా జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణేశ్‌తో పాటు మిగిలిన విగ్రహాలన్నీ నేడే గంగమ్మ ఒడికి చేరనున్నాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా శోభాయాత్ర కన్నుల పండువుగా సాగుతోంది. ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. గణేశ్‌ నిమజ్జనానికై తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం శుక్రవారం మెట్రో రైలు సేవలను అర్ధరాత్రి వరకు పొడిగించారు. ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ వంటి ప్రారంభ స్టేషన్లలో చివరి మెట్రో ఒంటి గంటకు బయలుదేరుతుంది. 2 గంటల వరకు ఇవి గమ్యస్థానం స్టేషన్లకు చేరుకుంటాయని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చూసేందుకు ప్రయాణికులు సమీప స్టేషన్లు ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌ స్టేషన్లలో దిగవచ్చు. ఈస్టేషన్ల నుంచి చివరి మెట్రో రైళ్లు ఇరువైపులా అర్ధరాత్రి 1.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. నిమజ్జనం సందర్భంగా జంటనగరాల్లో ఈరోజు, రేపు 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసులు నడుపాలని దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే నిర్ణయించింది. రోజువారీ సర్వీసులకు అదనంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తాయన్నారు.