Hyderabad: Minor crash halts Indian Racing League
mictv telugu

హైదరాబాద్‌లో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియా కార్‌ రేసింగ్ లీగ్‌

November 21, 2022

హైదరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఇండియా కార్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసింది. శనివారం టెస్ట్ రేస్‌లు.. ఆదివారం సమయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో రేస్‌లు నిర్వహించలేకపోయారు. పలు ప్రమాదాలు ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జేకే టైర్స్ ఆధ్వర్యంలో ఫార్మ్ లా-4 రేస్ మత్రమే నిర్వహించారు. సాయంత్రం చీకటి పడటంతో ఎలాంటి రేస్‌లు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. లీగ్ నిర్వహణకు రెండ్రోజులు మాత్రమే అనుమతి ఉండటం, క్వాలిఫయింగ్ రౌండ్ లో ఆలస్యం కారణంగా ప్రధాన రేసింగ్ అర్ధాంతరంగా రద్దు అయింది.

రేసింగ్‌లో ఆదివారం ఉదయం నుంచి ఐదు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక మహిళా రేసర్‌కు స్వల్ప గాయాలవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగితా నాలుగు ప్రమాదాల్లో కూడా రేసర్లకు చిన్న చిన్న గాయాలయ్యాయి. కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఫార్ములా ఈ రేసింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్ వేదికగా జరగనుంది. కాగా, శని, ఆదివారాల్లో జరిగిన కారు రేసింగ్ ను చూసేందుకు సందర్శకులు భారీగానే తరలివచ్చారు. ఈ రేస్ మధ్యలోనే రద్దు కావడంతో రేసింగ్ ప్రియులు కాస్త నిరాశకు గురయ్యారు. సమయాభావం, రేసర్లకు స్వల్ప ప్రమాదాల వల్ల అసలైన రేసును నిర్వాహకులు నిలిపివేశారు. దీంతో అసలైన తుది రేసింగ్‌ మజాను భాగ్యనగరవాసులు ఆస్వాదించలేకపోయారు.

మరోవైపు వేల రూపాయలు పెట్టి టికెట్‌ తీసుకున్నప్పటికీ లోపలికి అనుమతించలేదని కొందరు ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు గ్యాలరీలో ఉండటంతోనే లోపలికి పంపించలేదనే ఆరోపణలు వినిపించాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు పోటీలను చూసేందుకు వచ్చారు. ఫార్ములా ఈ రేసింగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.