Hyderabad MP Asaduddin Owaisi says suspension of BJP MLA Raja Singh is a drama
mictv telugu

ఎమ్మెల్యే రాజా సింగ్‌ సస్పెన్షన్ ఒక‌ డ్రామా.. అస‌దుద్దీన్ ఒవైసీ

August 30, 2022

MLA రాజాసింగ్‌పై సస్పెన్షన్ బీజేపీ ఆడుతున్న ఓ పెద్ద నాటకమన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. రాజాసింగ్‌ను విడిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్‌ను జైలుకు పంపారన్నారు.

ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు.. బీజేపీ మొదట దూరంగా ఉన్నా ఇప్పుడు ఆయన విడుదలకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండటం వల్లే రాజా సింగ్‌ను కటకటాల వెనక్కి నెట్టారని ఒవైసీ స్పష్టం చేశారు. అదే ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతిలో ఉంది కాబట్టే.. ప్రవక్త ముహమ్మద్‌పై దైవదూషణకు పాల్పడి ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఇంట్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం నూపుర్ శర్మను అరెస్టు చేయడానికి బదులు ఆమెకు భద్రత కల్పిస్తోందని ఒవైసీ ఆరోపించారు.

కర్ణాటకలో గణేశ్‌ చతుర్థి సందర్భంగా మాంసాహారంపై నిషేధం విధించడమేమిటని ఒవైసీ మండిపడ్డారు. బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని బీజేపీ యత్నిస్తోందని ప్రశ్నించారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో 80 శాతంమంది ప్రజలు నాన్‌వెజ్‌ తింటున్నారని పేర్కొన్నారు.