ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు అతని ఇంటిపై దాడి జరిగగా ఇప్పుడు మరోసారి జరగడం చర్చనీయాంశమైంది. దాడిపై అసదుద్దీన్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసుల విచారణ ప్రారంభించారు. అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడిపై ఆధారాలు సేకరించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
2014 నుంచి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారని, ఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాల్గవ ఘటన అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీలోని తన ఇంటికి తిరిగిరాగా రాళ్ల దాడి జరిగినట్లు పనివారు చెప్పారని, ఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు. రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒవైసీ రెండు రోజులుగా రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ప్రచారాన్ని సాగిస్తున్నారు.