Hyderabad: New police command likely to be inaugurated on Aug 4
mictv telugu

ప్రారంభానికి సిద్ధమైన కమాండ్ కంట్రోల్ సెంటర్

July 24, 2022

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతికతో.. ఆధునిక పరిజ్ఞానంతో ఐకానిక్ భవనంగా రూపుదిద్దుకున్న ఈ సెంటర్ ను ఆగస్టు 4 వ తేదీన ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. బంజారాహిల్స్‌లో రూ.585 కోట్లతో చేపట్టిన ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవ సన్నాహాలకు సంబంధించిన డ్రై రన్‌ను అదనపు సీపీలు డీఎస్‌ చౌహాన్‌, ఎ.ఆర్‌.శ్రీనివాస్‌, సంయుక్త కమిషనర్లు ఏవీ రంగనాథ్‌, డాక్టర్‌ గజరావు భూపాల్‌, డీసీపీలు జోయల్‌ డేవిస్‌, సునీతారెడ్డితో కలిసి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శనివారం పరిశీలించారు. ఆర్‌ అండ్ బీ, జీహెచ్ఎంసీ విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి జులై 31వ తేదీకల్లా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ భవనం ప్రారంభమైన తర్వాత ఆగస్టు రెండో వారంలో నగర పోలీసు కార్యాలయాన్ని అక్కడికి తరలించనున్నారు.

కొత్తగా ప్రారంభమయ్యే కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ప్రజలంతా సందర్శించేందుకు వీలుంది. 19 అంతస్తులున్న ఈ భవనంలో సందర్శకులు 14, 15 అంతస్తుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. టికెట్లు కొన్నవారికే అనుమతి ఉంటుంది. ఆరో అంతస్తులోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చి బయటనుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ పర్మిషన్‌ ఇస్తారు.