తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మందుబాబులకు కేసీఆర్ సర్కార్ శుభవార్తను చెప్పింది. ఇకనుంచి జంటనగరాల్లోని అన్ని బార్లు రాత్రి 12 గంటల వరకు తెరచుకోవచ్చని అనుమతులు ఇస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి ఒంటిగంట వరకూ బార్లు తమ కార్యకలపాలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఫైవ్‌స్టార్ హోటల్స్, ఎయిర్పోర్ట్ హోటళ్లు లైసెన్స్ ఫీజుపై 25% అదనంగా చెల్లిస్తే, 24 గంటలు మద్యం అమ్మకాలకు అనుమతించింది. హైదరాబాద్ నగరానికి విదేశీ పర్యాటకుల తాకిడి పెరగడంతో పాటు, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరోపక్క హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు ఎంత దుమారం రేపుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్ విషయంలో పోలీసులు వాటి సరఫరా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎవరు తీసుకొస్తున్నారు? ఏజెంట్లను నియమించుకున్నారా? అనే కోణాల్లో విచారిస్తున్నారు.
అయితే, ఈ కేసుకు సంబంధించి, ఓ ఇద్దరిని పోలీసులు సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరచగా, వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ ప్రభుత్వం మందుబాబులకు 12 గంటల వరకు బార్లను తెరిచి ఉంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ, ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్‌లోని మందు ప్రియులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.