ప్రభుత్వ ఆస్పత్రులు చాలా అవకతవకలకు అడ్డాలు. పేరు మోసిన ఆస్పత్రులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. హైదరాబాద్లోని ప్రముఖ నిమ్స్ ఆస్పత్రి.. సెకండ్ హ్యాండ్ బెడ్ షీట్లను కొని కొత్తవాటిగా చూపుతోందని ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా నగరంలోనే ఉన్న యశోద ఆస్పత్రిలో వాడిపారేసిన బెడ్ షీట్లను చవక ధరకు కొని నిమ్స్ బెడ్లపై పరిచేస్తున్నారని రోగులు వాపోతున్నారు.
సదరు బెడ్ షీట్లపై యశోద పేరు స్పష్టం కనిపించడే ఇందుకు రుజువు అంటున్నారు. వాటి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బెడ్ షీట్లు బాగుంటే యశోద ఆస్పత్రి ఎందుకు అమ్ముతారని, వాటికి కాలం చెల్లడం వల్ల, ఇన్ ఫెక్షన్లు సోకే అవకాశం వుండడం వల్లే చవగ్గా అమ్మేసి ఉంటారని చెబుతున్నారు. అవి కొత్త బెడ్ షీట్లని నిమ్స్ కొనుక్కుందని, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై నిమ్స్ అధికారులు ఇంతవరకూ స్పందించలేదు.