హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో మహిళల ప్రైవసీకి భంగం కలిగింది. రోడ్ నంబర్ 92లో ఉన్న ఓ బట్టల దుకాణంలోని బాత్రూంలో రహస్యంగా కెమెరా పెట్టి మహిళల వీడియోలు సేకరించాడు ఓ క్లీనింగ్ బాయ్. ఏడాది క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథున్ దాస్.. రోడ్ నం.92లోని ఓ బోటిక్‌లో క్లీనింగ్ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే బోటిక్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో ఎవరికీ తెలియకుండా.. తన సెల్‌ఫోన్‌ను వీడియో మోడ్‌లో ఉంచాడు.
దీంతో బోటిక్‌లో పని చేస్తున్న మహిళలు.. వాష్‌రూమ్‌కు వెళ్లగా ఆ దృశ్యాలు మొబైల్లో రికార్డు అయ్యాయి. ఇలా మిథున్ దాస్ పదుల సంఖ్యలో మహిళల వీడియోలను చిత్రీకరించి భద్రపరుచుకున్నాడు. ఆ బోటిక్ లో పనిచేసే మహిళ ఫోన్‌కు ఈ వీడియోలు పంపి , ఆమెను వేధించడం మొదలుపెట్టాడు . దీంతో బాధితురాలు ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఫోన్ ద్వారా చిత్రాలు సేకరించాడా లేకపోతే రహస్య సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.