హైద‌రాబాద్‌లో 1 నుంచి ఫ్రీ పార్కింగ్.. పక్కాగా అమలు - MicTv.in - Telugu News
mictv telugu

హైద‌రాబాద్‌లో 1 నుంచి ఫ్రీ పార్కింగ్.. పక్కాగా అమలు

March 29, 2018

వాహనాలు సంఖ్య పెరుగుతోంది. కానీ వాటిని నిలిపే స్థలం మాత్రం పెరగదు. లక్షలాది వాహనాలతో కిక్కిరిన హైదరాబాద్ నగరంలో పార్కింగ్ పెద్ద సమస్య. స్థలం లేకపోవడం ఒక సమస్య అయితే, పార్కింగ్ ఫీజుల పేరుతో సాగే దోపిడీ అంతకంటే పెద్ద సమస్య. ఈ  దందాకు సర్కారు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. వాహనదారుల సౌకర్యం కోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పార్కింగ్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తామని  జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్దన్ రెడ్డి తెలిపారు.

పార్కింగ్ పాల‌సీ అమ‌లుపై మ‌ల్టీప్లెక్స్‌, మాల్స్‌, వాణిజ్య స‌ముదాయాల య‌జ‌మానుల‌తో గురువారం జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. కమిషనర్ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్ర‌భుత్వం న‌గ‌రంలో పార్కింగ్ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అడ్డగోలుగా ఉన్న పార్కింగ్ చార్జీలను క్రమబద్ధీకరించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. న‌గ‌రంలో 9,100 కిలోమీట‌ర్ల ర‌హ‌దారులు ఉండ‌గా 54ల‌క్ష‌ల వాహ‌నాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ పార్కింగ్ స‌మ‌స్య ప‌రిష్కారానికిగాను ఖాళీగా ఉన్న ప్ర‌దేశాల‌ను గుర్తించి వాటిలో తాత్కాలికంగా పార్కింగ్‌ను క‌ల్పించే విధానాన్ని త్వ‌ర‌లోనే రూపొందిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

తొలి అరగంట ఉచితం..

కొత్త విధానం కింద.. మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్, వాణిజ్య సంస్థ‌ల్లో మొద‌టి 30 నిమిషాలు ఉచితంగా పార్కింగ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించాలి.  30 నిమిషాల నుంచి గంట వ‌ర‌కు ఆయా మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో షాపింగ్ చేసిన ర‌సీదు చూపిస్తే  పార్కింగ్ ఉచితం. గంటకంటే ఎక్కువ పార్కింగ్ చేసిన వారు పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసిన షాపింగ్ లేదా సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.