హైదరాబాద్ శివారులో అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తుక్కుగూడ లారీ డ్రైవర్‌పై కాల్పులు ఘటనలో పెద్ద ట్విస్ట్. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీపై కారులో వచ్చిన అగంతకులు గన్ తో తనపై కాల్పులు జరిపారని డ్రైవర్ చెప్పినదంతా కట్టుకథేనని పోలీసులు తేల్చారు. డ్రైవర్ మనోజ్ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన లారీడ్రైవర్ మనోజ్ ఐరన్ లోడుతో మెదక్ నుండి కేరళకు బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో లారీ ఆపిన మనోజ్.. యజమానిపై కోపంతో రాయితో లారీ అద్దాలను ధ్వంసం చేశాడు. కాసేపటి తర్వాత తేరుకున్న అతడు అద్దం పగులగొట్టినందుకు ఓనర్ డబ్బులు వసూలు చేస్తాడన్న భయంతో కాల్పుల నాటకానికి తెరదీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తనపై ఎవరూ కాల్పులకు పాల్పడలేదని.. ఓనర్‌కి భయపడి తానే నాటకమాడినట్లు మనోజ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకుముందు శనివారం రాత్రి స్విఫ్ట్ కారులో వచ్చిన దుండగులు తనపై కాల్పులు జరిపారని డ్రైవర్ ఓ సినిమా స్టోరీని చెప్పాడు.