Home > Featured > చందాల పేరుతో జబర్థస్తీ చేస్తే చర్యలు తప్పవు : సీపీ

చందాల పేరుతో జబర్థస్తీ చేస్తే చర్యలు తప్పవు : సీపీ

Hyderabad Police...

వినాయక చవితి వచ్చిందంటే భాగ్యనగరంలో సందడి అంతా ఇంతా కాదు. నెల రోజుల ముందు నుంచే మండపాల ఏర్పాటు చేస్తూ ప్రతి గల్లీలో హడావిడి కనిపిస్తుంది. నవరాత్రులు ప్రత్యేక పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇలా అయితే బాగానే ఉంటుంది. కానీ కొంత మంది గణేష్ మండపాల ఏర్పాటుతో చందాలు వసూలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు.

మన గల్లీలో గణేష్‌ విగ్రహం పెడుతున్నాం… చందాలివ్వండి అంటూ కొన్ని సార్లు జబర్థస్తీ చేస్తుంటారు. అయితే ఇక నుంచి బెదిరిస్తూ డబ్బుల వసూలు చేస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గణేష్ ఉత్సవాల ఏర్పాటుపై కమిషనర్ అంజనీ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటు పేరుతో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిపై కన్నేసి పెట్టినట్టు చెప్పారు. ఎవరైనా ఇంటికి వచ్చి జబర్ధస్తీ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్వచ్ఛందంగా ఇస్తేనే చందాలు తీసుకోవాలంటూ నిర్వాహకులను ఆదేశించారు. ప్రతీ ఏటా ప్రశాంతంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరమూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి చేస్తామని తెలిపారు.ఈసారి తొలి నిమజ్జనం ఖైరతాబాద్‌ గణేష్‌ విగ్రహాన్ని చేస్తామని పేర్కొన్నారు. 21 వేల మంది పోలీసులు, 56 ప్లటూన్ల ప్రత్యేక పోలీసులు, 5 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నామన్నారు.

Updated : 27 Aug 2019 10:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top