Hyderabad Police has imposed traffic restrictions in the surrounding areas of LB stadium today
mictv telugu

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ జంక్షన్ల వైపు వెళ్లొద్దు..

December 21, 2022

 Hyderabad Police has imposed traffic restrictions in the surrounding areas of LB stadium today

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సుజాత స్కూల్‌ లైన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ బిల్డింగ్‌ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి నిజాం కాలేజీ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి, చాపెల్‌రోడ్‌ వైపు మళ్లిస్తామని తెలిపారు. అబిడ్స్‌ నుంచి నిజాం కాలేజీ వైపు వచ్చే వాహనాలు ఎస్‌బీఐ, గన్‌ ఫౌండ్రి, నాంపల్లి రైల్వేస్టేషన్‌ మీదుగా మళ్లించనున్నారు. బషీర్‌బాగ్‌ నుంచి నిజాం కాలేజీ వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ మీదుగా మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. సుజాత స్కూల్‌ లైన్‌ నుంచి వచ్చే వాహనాలను స్కూల్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్డు మీదుగా ఆయా ప్రాంతాలకు మళ్లిస్తారు.

ఆంక్షల సమయంలో పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌, బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, రవీంద్ర భారతి, ఇక్బాల్‌ మినార్‌, ఎంజే మార్కెట్‌, హైదర్‌గూడ కూడళ్లవైపు వాహనదారులు రావొద్దని సూచించారు. లక్డీకపూల్‌, ఇక్బాల్‌ మినార్‌, హిమాయత్‌నగర్‌, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్‌, హైదర్‌గూడ జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ జంక్షన్ల నుంచి రాకపోకలు సాగించకపోవడం మంచిదని అదనపు సీపీ తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి నుంచి అబిడ్స్‌ వైపు కాకుండా.. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్డు మీదుగా వెళ్లాలి. ఎల్బీ స్టేడియంకు వచ్చే వారికి ముందస్తుగా పాస్‌లు జారీ చేసినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. పార్కింగ్‌ స్థలాలను అందుబాటులో ఉంచామని, ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు వాహనాలను పార్క్‌ చేయాలని పోలీసులు సూచించారు.