రూ.1.30 కోట్ల దొంగను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

రూ.1.30 కోట్ల దొంగను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

April 1, 2022

 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పోలీసులు ఎంతో కాలంగా ఓ గజ దొంగను పట్టుకోవాలని పలుమార్లు ప్లాన్ వేశారు. కానీ, ఆ దొంగను పట్టుకోలేకపోయారు. అయినా, పట్టిన పట్టును వదలకుండా ఎలాగైనా ఆ దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈసారి గట్టిగా ప్రయత్నించారు. దీంతో శుక్రవారం ఎట్టకేలకు ఆ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఆ దొంగను పోలీసులు విచారిస్తుండగా దొంగతనాలు ఎలా చేస్తాడో, ఆ విధానాలు ఏంటో, అతడు వేసే ప్రణాళికలను విని, ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇంతకి ఎవరు ఆ దొంగ? ఏ ప్రాంతానికి చెందిన వాడు? ఏం దొంగతనం చేశాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అతడి పేరు ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు. పోలీసులు ఎంతో కాలంగా వెదుకుతున్న గజదొంగ.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాజు మోస్ట్ వాంటెడ్ దొంగ. అతడి నుంచి రూ.1.30 కోట్ల విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల నుంచి చోరీలకు పాల్పడుతున్న రాజు.. ఆ నగలను ఎక్కడా అమ్మకుండా తనవద్దే పెట్టుకున్నాడు.అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హైదరాబాదులో రాజు ఉండేది ఫుట్‌పాత్ పైనే. అతని సొంతూర్లో మాత్రం అతడు సంపన్నుడు. స్వగ్రామంలో మూడంతస్తుల మేడ కట్టాడట.

ఈ నేపథ్యంలో రాజు ఎలా పడితే, అలా దొంగతనానికి వెళ్లడట. అతడికి వచ్చే కలల ఆధారంగానే చోరీలకు పాల్పడతాడట. తాను ఎక్కడ దొంగతనం చేయాలో ఆ ఇల్లు కలలో వస్తే, ఆ కలలో కనిపించిన ఇంట్లోనే పనితనం ప్రదర్శిస్తానని పోలీసులకు తెలిపాడు. అంతేకాదు, దొంగతనానికి వెళ్లాలో, వద్దో అనే విషయాన్ని చిట్టీల ద్వారా తేల్చేస్తాడట. రెండు చిట్టీలను వేసి ఒకదాన్ని తీస్తాడట. అందులో ఏం రాసి ఉంటే దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటాడట.