భాగ్యనగర వాసులకు విషాదం మిగిల్చిన జడివాన.. 24 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

భాగ్యనగర వాసులకు విషాదం మిగిల్చిన జడివాన.. 24 మంది మృతి

October 15, 2020

gbgcnb

భాగ్యనగరం వాసులకు భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. రోజంతా కుండపోత వానతో  అతలాకుతలమైంది.  రోడ్లన్నీ చెరువులను తలపించాయి. బస్తీలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. చెట్లు, కరెంట్ స్తంబాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీటికి తోడు పెద్ద ఎత్తున ప్రాణాలను కూడా వరదలు బలి తీసుకున్నాయి. 24 గంటల్లోనే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

జీహెచ్ఎంసీ పరిధిలో వరదల కారణంగా భారీ ఎత్తున మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో రెండు ఇండ్లు కూలిపోవడంతో 9 మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇక పల్లె చెరువులో 6 మృతదేహాలు గుర్తించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు రావడంతో బాలుడు చనిపోయాడు. బంజారాహిల్స్‌లో సెల్లార్ నీటి తోడేందుకు మోటార్ వేస్తూ సతీష్‌రెడ్డి అనే డాక్టర్ మృతి చెందారు. వివిధ ప్రాంతాల్లో కూడా మరణాలు సంభవించాయి. బండ్లగూడలో నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు శాలిబండలో ఓ భవనం గోడ కూలిన ప్రమాదంలో మహిళ తృటిలో తప్పించుకుంది. ఇలా దాదాపు అనేక ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని, ఆస్తి నష్టాన్ని కలిగించింది.