ఇకపై పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం.. సందర్శకులకు భలే ఛాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై పర్యాటక ప్రాంతంగా రాష్ట్రపతి నిలయం.. సందర్శకులకు భలే ఛాన్స్

March 7, 2023

సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శించాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇకపై 365 రోజులు రాష్ట్రపతి నిలయం తెరిచే ఉండనుంది. సాధారణ ప్రజలు.. ఇక నుంచి ఏడాది పొడవునా సందర్శించే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం, ప్రభుత్వం సెలవు దినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చునని తెలిపింది. అయితే అంతకుముందు రాష్ట్రపతి శీ శీతాకాల విడిది తర్వాత 15 రోజులు మాత్రమే సందర్శకుల కోసం తెరిచి ఉంచేవారు. ఈ క్రమంలోనే 162 ఏళ్ల రాష్ట్రపతి నిలయం చారిత్రక ప్రాధాన్యం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తెలుగువారి తొలి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా ఈ మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రపతి నిలయంలోకి ఏడాది పొడవునా వెళ్లే వెసులుబాటు రానుంది. ఈ మేరకురాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి వర్చువల్‌గా రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకుల కోసం ప్రారంభిస్తారు. ఈకార్యక్రమంలో గవర్నర్ తమిళి సై రాష్ట్రపతి నిలయం నుంచి భాగస్వామ్యం అవుతారు.

రాష్ట్రపతి నిలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై నిన్న (సోమవారం) రాష్ట్రపతి అడిషనల్ సెక్రటరీ రాకేశ్ గుప్తా అధ్యక్షతన పలువురు అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి నిలయం ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా తెరిచి ఉంచనున్నట్లు రాకేశ్ గుప్తా వెల్లడించారు. సందర్శకుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రపతి నిలయంలో ఎంట్రీ ఫీజు కింద ఒక్కొక్కరు రూ.50 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. విదేశీయులు అయితే రూ.250 చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రపతి నిలయం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈనెల 14 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని రాకేశ్ గుప్తా స్పష్టం చేశారు.