తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇరానీ చాయ్‌కి భారీ డిమాండ్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న చాయ్ ప్రియులకు భారీ షాక్ తగిలింది. హైదరాబాద్‌లో ధమ్ బిర్యానీ తర్వాత ఇరానీ చాయినే ఫేమస్. అలాంటి ఇరానీ చాయ్‌ని ప్రతిరోజు తాగేవాళ్లు హైదరాబాద్‌లో చాలమంది ఉన్నారు. అంతేకాకుండా ఏదైనా పని మీద బయటికి వెళ్లిన, ఆఫీసులో వర్క్ టెన్షన్ ఎక్కువైనా, స్నేహితులతో కలిసి టైం పాస్ కోసం వెళ్లిన ఇరానీ చాయ్‌కే మొదటి ప్రాముఖ్యతను ఇస్తారు. ఎందుకంటే ఇరానీ చాయ్‌లో రంగు, రుచి, చిక్కదనంతో పాటు, దానిలోని మరేదో ప్రత్యేకత ఉండి చాయ్ ప్రియులను కట్టిపడేస్తుంది. ఈ క్రమంలో గతకొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల సరుకుల ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడీ చాయ్ ధర కూడా పెరిగింది. ఏకంగా రూ.5 పెంచేస్తూ హోటల్స్ యాజమన్యాలు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు రూ.15గా ఉన్న కప్పు టీ ధర రూ.20కి చేరంది. ఇరానీ చాయ్ పొడి ధర కిలో రూ.300 నుంచి రూ.500 కు పెరగడమే ఇందులో కారణమని హోటళ్ల నిర్వాహకులు తెలిపారు.