ఆదివారం హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ‘గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్’లో.. ఇండియాలోనే అతి పెద్ద ప్లేట్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి సోనూసూద్ రావడం విశేషం.
స్వతహాగా శాఖాహారి అయిన సోనూసూద్ పేరు మీద ఒక నాన్ వెజ్ మండి పేరు పెట్టడం కొత్తగా అనిపించిందని సోనూసూద్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. అంతేకాదు.. దగ్గరుండి ఈ గ్రాండ్ లాంచ్ చేయడంలో భాగం అయ్యాడు. ఆయనతో పాటు నటి హిమజ, ఇన్స్ స్టా ఫేమ్ పద్దు.. పద్మావతి కూడా పాల్గొన్నారు.
విభిన్న రుచులకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్. భోజన ప్రియులున్న హైదరాబాద్ లో చికెన్ బిర్యానీ ఎక్కువ ఇష్టంగా తింటారు. ఆ తర్వాత మండికే ఓటేస్తారు. ఈ అరేబియన్ వంటకానికి హైదరాబాదీలు ఫిదా అవుతున్నారు. లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.
అందుకే నగరంలో కూడా చాలా చోట్ల ఈ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. అయితే వెరైటీ థీమ్ లతో ఆకట్టుకుంటేనే ఎవరైనా వస్తారు. అందుకే జైల్ థీమ్ తో వచ్చిన ‘గిస్మత్ మండి రెస్టారెంట్’ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకేసారి 20మందికి ఆహారం అందించే ప్లేట్ వల్ల అందరూ సంతృప్తిగా భోజనం చేస్తారని ఆ రెస్టారెంట్ యాజమాన్యం భావించింది. కోవిడ్ సమయంలో ఎంతోమందిని రక్షించిన సోనూసూద్ పేరు పెట్టడం, ఆయన ఒప్పుకోవడం చాలా సంతోషం వేసిందని తెలిపిందా యాజమాన్యం.
సోనూ సూద్ పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కి 11.91 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. రెస్టారెంట్ కూడా తమ ఇన్ స్టాలో ఈ పోస్ట్ షేర్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. అయితే కొందరు పాజిటివ్ గా స్పందించారు. మరికొందరు మాత్రం.. ‘మీ ప్లేట్ లో చాలా చనిపోయిన జంతువులను చూశాం. అదే శాకాహార అతి పెద్ద ప్లేట్ ను చూస్తే మరింత సంతోషిస్తాం సార్’ అని, ‘శాఖాహార వ్యక్తి మీరు.. నాన్ వెజ్ ని ప్రమోట్ చేయకండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.