ఈ పోరగాడ్ని చూసైనా..మేల్కొండి సార్లూ... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పోరగాడ్ని చూసైనా..మేల్కొండి సార్లూ…

July 4, 2017

హైదరాబాద్ విశ్వనగరం. గ్రేట్ సిటీ. బెస్ట్ లీవింగ్ సిటీ ఇలా చెప్పుకుంటే పోతే అన్నింట్లో అద్భుతం.రోడ్ల విషయానికి వస్తే మాత్రం జీరో.ఏ రోడ్ చూసినా గుంతల మయమే.గల్లీ రోడ్లు అయితే తవ్వేవదిలేశారు. సీఎం కేసీఆర్ ఒక్క గుంత కనిపించొద్దని ఆర్డరేసి నెలరోజులు దాటినా అధికారులలో చలనం లేదు..ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల కంకరపోసి మేనేజ్ చేశారు. ఇలాగే ఉంటే ఎంత మంది ప్రాణాలు పోవాలి..? ఎంతమంది కాళ్లు, చేతులు విరగ్గొట్టుకోవాలి..? నిద్రమత్తులో జోగుతోన్న జీహెచ్ ఎంసీ అధికారులు…ఈ పోరగాడ్ని చూసైనా మేల్కొండి..?.సమావేశాలు..సమీక్షలు…వాకింగ్ లు చెకింగ్ లు అంటూ ఇంకెంత కాలం గడుపుతారు..?

గుంతలు పూడ్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డర్ వేసి నెలరోజులు దాటినా ఒక్క రోడ్డు బాగు పడలేదు..గుంతలు అలాగే ఉన్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు కంకర పోసి గుంతల్ని మాయం చేశారు. మరికొన్ని చోట్ల మట్టిపోసి కవర్ చేశారు. మంత్రులు , ప్రభుత్వ ఉన్నతాధికారులు తిరిగే మార్గాల్లో ప్యాచ్ వర్కులతో కానిచ్చేశారు. ఎలాగూ వానకాలమే..రోడ్లు వేసినా కొట్టుకుపోతాయని అనుకున్నారేమో కాంట్రాక్టర్లు.. ఎక్కడి గుంతల్ని అక్కడే వదిలేశారు.

కొన్ని రూట్లలో దాదాపు మెట్రో పనులు అయిపోయాయి. పనులు అయిపోయి కూడా ఆర్నెళ్లు అవుతుంది. కానీ రోడ్ల పరిస్థితి అలాగే ఉంది. పది , ఇరవై అడుగులకో గుంత కనిపిస్తుంది. మియాపూర్ నుంచి ఎస్ ఆర్ నగర్ దాకా రోడ్డు మధ్య మధ్యలో గుంతలు దారుణంగా ఉన్నాయి. ఈ ఒక్క ప్రాంతమే కాదు..అన్నిరోడ్లు ఇలాగే ఏడ్చిచాయ్..అంటే అన్నారు.. అంటారు కానీ ఈ నరకదారులు తెలంగాణ పాలకుల ఏలుబడిలో కూడా ఏంటో..?

మెయిన్ రోడ్లు అలా ఉంటే..కాలనీల రోడ్లు చెత్తగా ఉన్నాయి. అంతా గుంతలే..చూద్దామన్నా ఎక్కడా మంచి రోడ్ కనిపించదు. గరీబోళ్ల కాలనీలైతే ఇంకా గలీజు…పైపులైన్ల కోసం రోడ్లని తవ్వి వదిలేశారు. కనీసం జేసీబీలతో చదను చేసి అయినా వదిలెయ్యలేదు..గుంతలు మిట్టలతో ఆ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులు వణుకుతున్నారు. పక్కాటెముకలు సైతం కదులుతుండటంతో పరేషాన్ అవుతున్నారు. డర్టీ రోడ్స్ ,, సడెన్ బ్రేకులతో వాహనదారులకు షేకింగ్ లే కాదు షాకింగ్ లు తప్పడం లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇలా మొన్న వివేకానందనగర్ లో జరిగిన ప్రమాదాన్ని చూసి హబ్సిగూడకు పన్నెండ్ల కుర్రాడు రవితేజ చలించిపోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యాక్సిడెంట్ లో చనిపోవడం తట్టుకోలేకపోయాడు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చటానికి చెందిన ఒంటరిగా రోడ్డెక్కాడు. ఓ చెక్కపెట్టెలో రాళ్లు, మట్టితో రెడీ అయ్యాడు. హబ్సిగూడలోని రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాడు. ఆ చిన్నారి చర్యలు ఎంతో మందిని కదిలించాయి. గుంతల రోడ్డు కారణంగా ఎవరూ చనిపోకూడదని.. అందుకే రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తున్నానని తెలిపాడు. జాతీయస్థాయిలో రవితేజ చేస్తున్న పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరి జీహెచ్ ఎంసీ అదికారులకు ఏమైంది. బాలుడ్ని చూసైనా జర మేల్కొండి సార్లూ.. గుంతల రోడ్లన్ని పూడ్చేయండి. అసలే వానాకాలం..ఏదైనా జరిగాక మేల్కొనే దానికన్నా ముందే జాగ్రత్త పడండి. కాంట్రాక్టర్లను తరుమండి. నరకదారులతో హైదరాబాద్ ఇజ్జత్ తీయకండి. భూమి లోతుల్లోకి కూరుకుపోయిన మ్యాన్ హోల్స్ ను మరమత్తులు చేయండి. రోడ్లను మిల మిల మెరిసేలా చేయుండ్రి సార్లూ..మీకు పుణ్యం ఉంటదని నగర వాసులు అంటున్నారు.