హైదరాబాద్ ను బదనాము చెయ్యకండి ! - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ ను బదనాము చెయ్యకండి !

July 15, 2017

ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఇదేనేమో ? ఎవరో చేసిన పాపానికి దాన్ని హైదరాబాదు మీద రుద్దడమేంటో మరీ విడ్డూరమైన విషయమే ! డ్రగ్స్ మాఫియాలో సినిమావాళ్ళ పేర్లు వినిపిస్తున్న దానికి హైదరాబాదుకి లింక్ కలిపడమేంటో ? పంజాబ్ రాష్ట్రంలో ఇంటికొక డ్రగ్గిస్ట్ వుంటాడని దాన్ని ఉడ్తా పంజాబ్ అంటారు. ఉడ్తా హైదరాబాదు అని సోషల్ మీడియాలో కొందరు పని గట్టుకొని దుష్ప్రచారానికి నడుం బిగించారు. ఈ భాగ్య నగరం మీద అభిమానం వున్న చాలా మంది నగరవాసులు అలా పబ్లిసిటీ చేస్తున్న వారి మీద ఫైర్ అవుతున్నారు. ఎక్కడెక్కడివాళ్ళో ఈ హైదరాబాదులో జీవిస్తున్నారు. ఎలాంటివారినైనా ఈ షహర్ అలాయ్ భలాయ్ తీస్కొని అక్కున చేర్చుకుంది. కొందరు గిట్టనివాళ్ళు ఇక్కడ వుంటూ ఈ నగరం నీళ్ళు తాగి తల్లి రొమ్ము మీద తన్నినట్టు బదనాము చేస్తున్నారు.

ఆమధ్య వచ్చిన ‘ ఉడ్తా పంజాబ్ ’ సినిమా మీద చాలా వివాదాలు ముసురుకున్నాయి. హైదరాబాదు ఇంకా అంత నీఛ స్థాయికి దిగజారలేదు. ఈ నగరంలోని మనుషులకు కొన్ని వ్యాల్యూస్ తెలుసు. ఇక్కడి మనుషులు, అవలంభించే సంస్కృతి చాలా భిన్నమైంది. గొప్ప సంస్కృతిలో వున్నారు గనకే ఇక్కడివాళ్ళు నగరానికి మచ్చ తెచ్చే ఏ తప్పు పని చెయ్యరు. సినిమావాళ్ళు తప్పు చేస్తే దాన్ని అందరి మీద రుద్దటం అనేది చాలా దుర్మర్గమైన పని అని నెటిజనులు గుస్సా అవుతున్నారు. తప్పు చేసినవాళ్ళను మాత్రమే అంటే బాగుంటుంది గానీ సంబంధంలేని వాళ్ళను కూడా ఒకే గంపకింద కు తోసి నిందలు మోపడం అనేది చాలా దుర్మార్గమైన పద్ధతి. ఇప్పటికైనా కావాలని ఇలాంటి రాంగ్ పబ్లిసిటీకి ఒడిగట్టినవాళ్ళు దాన్ని విరమించుకుంటే ఈ నగరానికి వాళ్ళు చేసే గొప్ప పుణ్యమైన పని అదే అవుతుందని హైదరాబాదు అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా వాదిస్తున్నారు.