గ్రూప్ 1 మెయిన్స్‌కి అర్హత సాధించాననే ఆనందంలో విహార యాత్రకు వెళ్లిన హైదరాబాదీ సాఫ్ట్వేర్ యువకుడు మరణించిన ఘటన ఇది. సముద్ర గర్భంలో దిగి బాగా లోతుగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళితే.. నాగోలు బండ్లగూడకు చెందిన వంశీకృష్ణ (27) అనే యువకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది నగరానికి చెందిన యువతితో పెళ్లవగా, మరోపక్క గ్రూప్ 1 ఫలితాల్లో మెయిన్స్‌కి అర్హత సాధించాడు. ఈ నేపథ్యంలో వంశీ ఈ నెల 13న తన భార్య ఇతర బంధువులతో కలిసి మలేషియా, ఇండోనేషియా దేశాలకు విహారయాత్రలకు వెళ్లారు.
మొదట మలేషియా టూర్ కంప్లీట్ చేసుకొని ఈ నెల 22న ఆదివారం రోజు ఇండోనేషియాలోని బాలి నగరానికి చేరుకున్నారు. అక్కడ సముద్ర గర్భంలో ఉన్న అక్వేరియాన్ని చూసేందుకు వంశీ ఒంటరిగా బాగా లోపలికి వెళ్లి గల్లంతయ్యాడు. ఎంతకీ పైకి రాకపోవడంతో నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించి సముద్రంలో గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. విషయం తెలిసిన నగరంలోని కుటుంబసభ్యులు మంగళవారం బాలికి బయల్డేరి వెళ్లగా, లోతుగా వెళ్లి భయంతో గుండెపోటు వచ్చి చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.