వరుస నేరాలతో కలవరపడుతోన్న హైదరాబాద్ నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సిటీలో ఆదివారం శక్తిమంతమైన రసాయన పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఓ వ్యక్తి తునాతునకలైపోయాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన అఫ్జల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలీగూడలో బ్లాస్ట్ చోటు చేసుకొంది. కెమికల్‌ను డ్రైనేజ్‌లో వేసి నీళ్లు పోస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో భరత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతడి తండ్రి వేణుగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. భరత్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వేణుగోపాల్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు జరిగిన తీరు, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించారు.