Hyderabad Southzone DCP CC cheated in the name of car consultancy, says Victims
mictv telugu

పోలీసు శాఖలో మరో చీడపురుగు.. లక్షలు దండుకున్న గోపీకృష్ణ

July 30, 2022

హైదరాబాద్ పోలీస్ శాఖలో మరో కిలాడీ అధికారి వ్యవహారం తాజాగా బయటపడింది. ఇప్పటికే సీఐ నాగేశ్వరరావు లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురి కాగా, ఇప్పుడు మరో పోలీస్‌ అధికారి.. తక్కువ ధరలకే కార్లు ఇప్పిస్తానని అమాయకుల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నాడు. సౌత్ జోన్ డీసీపీ దగ్గర సీసీగా పనిచేస్తున్న గోపీకృష్ణ అనే వ్యక్తి తన బామ్మర్ది శశాంక్ కు కార్ల డీలర్ షిప్ ఉందని నమ్మించి పలువురి దగ్గరు డబ్బులు తీసుకున్నాడని సమాచారం. అయితే సంవత్సరాలు గడుస్తున్నా కారు ఇవ్వకపోగా.. తిరిగి డబ్బులు కూడా ఇవ్వట్లేదని ఓ బాధితుడు వాపోతున్నాడు. ఈ విషయం గురించి గోపికృష్ణ పై అధికారులకు తెలిపినా, పీఎస్ లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, కేసు కూడా నమోదు చేయడం లేదని మహ్మద్ యాసిన్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

తన వద్ద శశాంక్ రూ. 3 లక్షలు తీసుకున్నాడని.. కారు సంగతి అటుంచితే ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదంటున్నాడు . ఈ విషయంలో గోపీకృష్ణ సైతం సైలెంట్ అయిపోయాడని చెబుతున్నాడు యాసిన్‌. ఈక్రమంలో తన బామ్మర్ది శశాంక్‌కు తాను డీలర్ షిప్ ఇప్పించిన మాట వాస్తవమే కానీ డబ్బులు వ్యవహారంలో తానెంత చెప్పినా వినట్లేదని గోపికృష్ణ మెసేజ్ చేసినట్టు యాసిన్‌ వాట్సాప్ స్క్రీన్ షాట్లు బయటపెట్టాడు. ఇదే విషయంపై సౌత్‌ జోన్‌ డీసీపీకి, గోల్కొండ పోలీసులకి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు చెబుతున్నాడు. తనకు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు తెలుసునని మీరు ఎక్కడికి వెళ్లినా ఏమీ చేయలేరని బాధితులను గోపికృష్ణ బెదిరిస్తున్నాడని తెలిసింది.