తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రియురాలి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. పరిపక్వత లేని వయస్సులో ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం.. వెరసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ అమ్మాయి ప్రేమ ఇద్దరి స్నేహితుల మధ్య పెట్టిన చిచ్చు.. హత్యకు దారి తీయడంపై రాష్ట్రమంతా తీవ్ర చర్చనీయాంశమైంది. హత్య జరిగినప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 17 నుంచి ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రతిరోజూ ఏదో ఒక సంచలన విషయం బయటపడుతున్నది.
ఇంటర్ లో దోస్తానా
ఇదో సైకో లవ్ స్టోరీ. ప్రియురాలు తనకు దక్కదన్న అక్కసుతో స్నేహితుడినే కసితీరా చంపిన క్రైమ్ కహాని. దోస్త్ కదా అని నమ్మినందుకు ప్రాణాలు కోల్పోయిన నవీన్ అంతానికి ఇంటర్ లో ఆరంభం మొదలైంది. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ (22), వరంగల్‌కు చెందిన హరిహరకృష్ణ దిల్‌సుఖ్‌నగర్ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివారు. హైదరాబాద్ కు చెందిన నిహారిక అనే అమ్మాయి కూడా వారితోపాటే అక్కడ చదివింది. ఇంటర్ తరువాత నల్లగొండ ఎంజీ యూనివర్సిటీలో నవీన్, పీర్జాదిగూడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో హరిహరకృష్ణలు బీటెక్ లో జాయిన్ అయ్యారు. ఇంటర్‌లో ఉన్నప్పుడే నవీన్, నిహారికలు ప్రేమించుకున్నారు. మనస్పర్థలు రావడంతో ఇద్దరికి బ్రేకప్ అయింది. ఇదే సమయంలో నిహారికకు హరిహరకృష్ణ దగ్గరయ్యాడు. విషయం తెలుసుకొన్న నవీన్ మళ్లీ యువతితో మాట్లాడటం ప్రారంభించాడు. నిహారిక కూడా నవీన్ తో మునుపటిలాగే మాట్లాడడంతో హరిహరకృష్ణ భరించలేకపోయాడు. ఈ విషయంపై స్నేహితులిద్దరు చాలాసార్లు గొడవపడ్డారు. ఇక నిహారిక తనకు దక్కదన్న అక్కసుతో ఎలాగైనా అతన్ని చంపేయాలని హరిహరకృష్ణ స్కెచ్ వేశాడు.
గెట్ టు గెదర్ పార్టీకి పిలిచి
ఇంటర్మీడియెట్ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ పార్టీ ఉంది తప్పకుండా రావాలని నవీన్ కు హరిహరకృష్ణ చెప్పాడు. ఆ పార్టీకి నవీన్ వస్తే అదే రోజు చంపేద్దామనుకున్నాడు. ఎందుకో కాని ఆ రోజు నవీన్ రాలేదు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హరిహరకు ఫోన్ చేసిన నవీన్ ఫిబ్రవరి 17న హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. ఆ రోజు ఎల్‌బీనగర్‌లో బస్సు దిగిన నవీన్ ను మూసారాంబాగ్‌లోని తన ఫ్రెండ్ రూమ్ కి హరిహరకృష్ణ తీసుకెళ్లాడు. సాయంత్రం వరకే ఉంటానన్న నవీన్, ఆ తరువాత కాలేజీ హాస్టల్‌కు వెళ్లిపోతానని చెప్పడంతో ఎలాగైనా ఆ రోజే అతన్ని హత్య చెయ్యాలని హరిహర డిసైడ్ అయ్యాడు. నవీన్ తో గొడవ పడేందుకు కారణాల కోసం చూశాడు. కావాలని నిహారిక ప్రస్తావన తీసుకొచ్చి నవీన్ తో గొడవపడ్డాడు. అయితే నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్ చేయడంతో హరిహర అనుకున్నట్టుగా గొడవ కొనసాగలేదు. ఫోన్ లో హరిహరతో మాట్లాడిన శంకరయ్య ఇద్దరు కలిసి ఉండాలని సర్దిచెప్పాడు. దీంతో ఇక అక్కడ తన ప్లాన్ వర్క్ అవుట్ కాదనుకున్న హరిహర బయటికి పోవడానికి నవీన్ ను ఒప్పించాడు. అప్పటికే కొని పెట్టుకున్న కత్తి, గ్లౌజులను ఒక బ్యాగ్‌లో పెట్టుకుని, అతడితో కలిసి బయల్దేరాడు హరిహరకృష్ణ. బైక్‌పై నవీన్‌ను ఎక్కించుకుని అబ్దుల్లాపూర్‌మెట్ లో ఓ వైన్‌షాప్ వద్ద ఆపాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. రాత్రి 11గంటలకు హరిహర సెల్‌ఫోన్ నుంచి నిహారికకు నవీన్ ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్‌పై బయల్దేరారు. రామోజీ ఫిలిం సింటీ దగ్గర యూ టర్న్ తీసుకుని వెనక్కివస్తూ తాను అనుకున్న చోటుకు వచ్చాక ప్రేమించిన యువతి ప్రస్తావనను హరిహర తీసుకొచ్చాడు. రోడ్డు నుంచి పక్కనున్న పొదల బాటలోకి బైకును మళ్లించి రమాదేవి పబ్లిక్ స్కూల్ దగ్గర ఆపాడు. గుట్టల్లోకి నవీన్ ను తీసుకెళ్లి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఎక్కడపడితే అక్కడ కసితీరా పొడిచి చంపాడు.
ఫస్ట్ కాల్ ఆ అమ్మాయికే..
నవీన్ చనిపోయాడని కన్ ఫం చేసుకున్నాక ఆ విషయాన్ని నిహారికకు హరిహరకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు. నవీన్ డెడ్ బాడీ నుంచి ఒక్కో భాగాన్ని కోస్తూ నిహారికకు ఫోటోలు పంపాడు. ‘ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఈ గుండె కదా నిన్ను ప్రేమించింది అంటూ ఆ అవయవాలను కోసి ఫోటోలను వాట్సాప్ చేశాడు. చివరకు నవీన్ తలని కోసి దూరంగా వేశాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ ఫోటోలను చూసిన నిహారిక ఏ మాత్రం భయపడకుండా సింపుల్ గా ‘అవునా.. ఓకే వెరీ గుడ్ బాయ్’ అంటూ మెసేజ్ లన్నింటికి రిప్లై ఇచ్చింది.
ఎలా బయటపడిందంటే
నల్లగొండ నుంచి నుంచి హైదరాబాద్ వచ్చిన నవీన్ అదే రోజున అంటే ఫిబ్రవరి 17 న రాత్రి 8 గంటలకు హాస్టల్ ఫ్రెండ్ ప్రదీప్‌కు ఫోన్ చేశాడు. ‘రావడానికి ఆలస్యం అవుతుంది. అన్నం తీసి పెట్టు’ అని చెప్పాడు. నవీన్ ఎంతకూ రాకపోవడంతో రాత్రి తొమ్మిదిన్నరకు ప్రదీప్ ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. నవీన్ తిరిగి రాకపోవడంతో అతని స్నేహితులు ఆరా తీశారు. హరిహరకృష్ణతో కలిసి పార్టీ చేసుకున్నట్టు తెలుసుకున్నారు. హరిహరకృష్ణకు కాల్ చేసి మాట్లాడారు. చిన్న గొడవ జరిగితే రాత్రే అబ్దుల్లాపూర్‌మెట్‌లో దింపేశానని కూల్ గా చెప్పాడు హరిహర.
మర్డర్ స్పాట్‌కు నిహారిక
హత్య తర్వాత బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి హరిహరకృష్ణ వెళ్లాడు. ఒక వ్యక్తిని చంపానని హాసన్‌కు చెప్పాడు. మృతుడి శరీర భాగాలను మాయం చేసేందుకు సాయం చేయాలన్నాడు. ఇద్దరు కలిసి నవీన్ శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. మన్నెగూడ శివార్లలో పడేశారు. అక్కడి నుంచే నిహారికకు, తన తండ్రికి హరిహర కాల్ చేసి మాట్లాడాడు. మద్యం మత్తులో ఉన్న హరిహరను పోలీసుల ఎదుట లొంగిపొమ్మని హసన్ చెప్పాడు. అదంతా తర్వాత చూద్దాం అంటూ అక్కడ రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ను మార్చి, స్నానం చేసి ఆ రాత్రి హసన్ ఇంట్లోనే పడుకున్నాడు.
ఏ ఒక్కరూ పోలీసులకు చెప్పలేదు
మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 18న ఉదయం.. హసన్ ఇంటి నుంచి హస్తినాపురంలోని నీహారిక దగ్గరకు హరిహర వెళ్లాడు. వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలని అడగడంతో ఆమె 1500 రూపాయలను అతడికి ట్రాన్స్‌ఫర్ చేసింది. తరువాత నుంచి రోజు హసన్, నీహారికతో ఫోన్‌లో హరిహర టచ్ లోనే ఉన్నాడు. నవీన్ హత్య సంగతి తెలిసిన హరిహర తండ్రి ప్రభాకర్ పోలీసులకు లొంగిపోవాలని కుమారుడికి సూచించాడు.కాని అతడు వరంగల్ నుంచి వైజాగ్ వెళ్లాడు. అక్కణ్నుంచీ 20వ తేదీ రాత్రి హైదరాబాద్ కొచ్చి మళ్లీ నీహారికను కలిశాడు. బైక్‌పై ఆమెను ఎక్కించుకుని.. నవీన్‌ను చంపిన ప్లేస్ కు తీసుకెళ్లాడు. కొద్దిదూరం నుంచి మృతదేహాన్ని చూపించి.. హత్య ఎలా చేశాడో వివరించాడు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. ఆ తర్వాత ఆరు రోజుల పాటు కోదాడ, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో హరిహర తిరిగాడు. హత్య జరిగిన రోజే ఈ విషయం గురించి స్నేహితుడు హసన్‌కు, ప్రేయసి నిహారికకు, తండ్రి ప్రభాకర్ కు హరిహరకృష్ణ చెప్పాడు. అందరికీ తెలిసినా ఈ విషయాన్ని ఏ ఒక్కరూ పోలీసులకు చెప్పలేదు.
కాల్చి చంపేస్తారని భయపడి..
నాలుగు రోజులుగా నవీన్ కాలేజీకి వెళ్లడం లేదని తండ్రి శంకరయ్యకు తెలిసింది. అనుమానం వచ్చి ఈ నెల 22న నార్కట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహర తో గొడవ జరిగిందని తన కొడుకు ఫోన్ చేసిన విషయాన్ని కూడా చెప్పాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నవీన్ స్నేహితులను విచారించారు. ఈ విషయాలన్నీ హరిహరకు తెలియడంతో దొరక్కుండా తిరిగితే పోలీసులు కాల్చిచంపేస్తారని భయపడి లొంగిపోవాలనుకున్నాడు. ఫిబ్రవరి 24న హైదరాబాద్ కు తిరిగి వచ్చిన హరిహరకృష్ణ నిహారికతో పాటు స్నేహితుడు హాసన్‌ను కలిశాడు. ముగ్గురు కలిసి కలిసి మన్నెగూడ శివార్లకు వెళ్లి అక్కడ అంతకుముందు పడేసిన నవీన్ శరీర భాగాలను తీసుకుని, తిరిగి మర్డర్‌స్పాట్‌కు వచ్చారు. ఆధారాలను మాయం చేయాలన్న కోణంలో ఆలోచించి వాటిలో కొన్ని భాగాలను తగలబెట్టారు. అనంతరం నీహారిక ఇంటికి వెళ్లారు. అక్కడే స్నానం చేశారు. ఆ సమయంలో నీహారిక ఇంట్లోవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉన్నారు. తమ మెసేజులు, కాల్ డేటా మొత్తం డిలీట్ చేసుకున్నారు. ‘ఆధారాలన్నీ మాయం చేశాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నేను లొంగిపోయి.. ఒక్కణ్నే ఈ హత్య చేశానని ఒప్పుకొంటా’ అని హరిహర వారికి ధైర్యం చెప్పాడు. అనంతరం 24న రాత్రి.. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల ముందు లొంగిపోయాడు.
విస్తుపోయే వాస్తవాలివీ..
విచారణ చేపట్టిన పోలీసులకి హరిహరకృష్ణ చెప్పిన సమాధానాలతో మైండ్ బ్లాంక్ అయింది. తన స్నేహితుడు నవీన్‌ను, తాను ప్రేమించిన నిహారిక కోసం హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఈ హత్య చేసేందుకు మూడు నెలల నుంచే ప్లాన్ వేశానని తెలిపాడు. ఓ షాపింగ్ మాల్‌లో రెండు నెలల క్రితమే కత్తిని కొనుగోలు చేశానని, దానిని స్కూటీలో పెట్టుకుని తిరిగానని చెప్పాడు. హరిహరను తీసుకుని హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు పరిశీలించారు. అక్కడ నవీన్ మృతదేహం పూర్తిగా కూళ్లిపోయింది. శరీర భాగాలు గుండె తల, మొండెం, చేతి వేలు, మర్మాంగలు కత్తితో కోసి ఉన్నాయి. ఇంతటి హత్యను కూడా హరిహరకృష్ణ చాలా తేలికగా తీసుకున్నట్టు గుర్తించారు.
ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు
ఈ హత్యకు కారణమైన నిహారికను కూడా మూడు సార్లు పోలీసులు విచారించారు. ఎన్ని సార్లు చెప్పినా.. సమాధానం మాత్రం ఒకటే.. నాకేమీ తెలియదు. నన్ను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు. సఖి సెంటర్‌లో కౌన్సిలింగ్ ఇప్పించినా అమ్మాయి తీరు మారలేదు. కౌన్సిలింగ్ ఇప్పించినా, కుటుంబ సభ్యులు ఇంత బాధపడుతున్నా నిహారికలో ఇసుమంత కూడా పశ్చాత్తాపం లేదు. అయితే పోలీసులు తమదైన స్టైల్ లో ఆమెను చాలా తెలివిగా విచారించారు. ఆమె సాక్ష్యాలు దాచిందన్న విషయాన్ని ఫ్రూఫ్స్‌తో సహా నిర్ధారించుకున్నారు. క్రాస్ క్వశ్చన్స్‌తో చేయడంతో ఆమె దొరికిపోయింది. హత్య చేసిన తర్వాత నిజం ఎవరికీ చెప్పకుండా దాచినందుకు ఆమెను ఏ3గా చేర్చారు పోలీసులు. అటు హసన్‌ను కూడా ఇదే విషయంపై ఏ2గా చేర్చారు. హయత్ నగర్ కోర్టులో నిహారికాను ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆదేశాలతో నిహారికను చంచల్‌గూడ విమెన్ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు 14రోజుల రిమాండ్ కోసం తరలించారు.