Hyderabad Task Force Constable Eshwar Heading Gang Of Thieves Arrested, Has Stuartpuram Roots
mictv telugu

కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ.. సొంతంగా దొంగల ముఠా ఏర్పాటు

November 23, 2022

వృత్తి పోలీస్‌ అయినా చేసేవి మాత్రం దొంగ పనులు. కేవలం ఉద్యోగం మీద పన్నెండేళ్లలో దాదాపు రూ.20 కోట్లకు పైగా విలువైన ఆస్తులు కూడబెట్టడం పలు అనుమానాలకు దారి తీసింది. ఒక్కోసారి ‘ కానిస్టేబుల్ ఉద్యోగం ఉన్నా పోయినా నాకు పెద్ద ఫరక్‌ పడదు’ అంటూ సహోద్యోగుల్నే కాదు.. అధికారులనూ బెదిరించే వాడట. అవును మరీ అతను నాలుగు రాష్ట్రాల్లోని సెల్‌ఫోన్ దొంగలతో గట్టి నెట్‌వర్కే ఉంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఈశ్వర్.. గౌరవనీయమైన పోలీస్‌ వృత్తిలో ఉంటూ దొంగలతో చేతులు కలిపి నెలసరీ మామూళ్లు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. చిన్నప్పటి నుంచి గ్యాంగ్ స్టర్ కావాలన్న తన కోరికను దొంగ సొమ్ము ద్వారా సాకారం చేసుకుందామనుకున్నాడు. అందులో భాగంగానే చోరీకి గురైన మెుబైల్ ఫోన్లను ఎవరైతే సెంకడ్ మార్కెట్‌లో కొంటారో.. వారిని ఈఎంఐ నెంబర్ల ఆధారంగా గుర్తించి డబ్బుల కోసం బెదిరించేవాడు. లేదంటే సెల్‌ఫోన్ దొంగిలించినట్లు కేసు పెడతానని బెదిరించగా.. వారు ఈశ్వర్ అడిగినంత ముట్టజెప్పేవారు. కొన్నేళ్లకు ఈశ్వర్‌ ప్రవర్తన మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో పోలీస్‌ ఆపరేషన్స్‌కు దూరంగా పెట్టారు. దీంతో తనకున్న పలుకుబడితో టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి బదిలీ చేయించుకున్నాడు

ఇక ఏ అడ్డూ లేదనుకోని.. గాంధీనగర్‌లో ఓ పోలీసు అధికారి తోడ్పాటుతో నేరస్తుల నుంచి సొత్తు గుంజటం ప్రారంభించారు. ఈ సంపాదన చాలక దొంగల ముఠాలనే రూపొందించాడు. వారితో దొంగతనం చేయించి ఆ డబ్బును తన జేబులో వేసుకునే వాడు. వారికి రోజుకింత అని టార్గెట్‌లు పెట్టి తోచిన డబ్బును కూలీగా ఇచ్చేవాడు. ఈశ్వర్‌ ఉత్తర మండలంలోని ఓ పీఎస్‌లో పనిచేసినప్పుడు ఉదయం వెళ్లి సంతకం పెట్టి, విధులకు డుమ్మా కొట్టి దొంగలతో బేరసారాలు, సెటిల్‌మెంట్‌లు నడిపేవాడు. ప్రశ్నించిన ఇన్‌స్పెక్టర్‌కు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చేవాడు. బదిలీ చేయిస్తానంటూ బెదిరించేవాడు. చిన్నపిల్లలు, మహిళలతో ముఠాలు కట్టించి చోరీలు చేయించటం ప్రారంభించాడు. ప్రస్తుతం 4-5 ముఠాలకు చీరాల, హఫీజ్‌పేటలోని తన నివాసాల్లో బస ఏర్పాటుచేసి ఏపీ, తెలంగాణలో దొంగతనాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

ఇటీవల నల్గొండ పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు చిన్నారులు, మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఇతడి బండారం బట్టబయలైంది. పక్కా ఆధారాలతో సోమవారం నల్గొండ పోలీసులు కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈశ్వర్‌ను సస్పెండ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇతనికి సహకరించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఇతడికి సహకరించిన మరో కానిస్టేబుల్‌పైనా విచారణకు ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడేవాడంటూ గతంలో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించినా సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ ఉన్నతాధికారి సహకారంతో అడ్డంకులు అధిగమించేవాడని తెలుస్తోంది. ప్రస్తుతం హఫీజ్‌పేటలో నివాసముంటున్న ఈశ్వర్‌ స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం. ఒకప్పుడు ఈ ప్రాంతం దొంగలకు చాలా ఫేమస్. ఈ ఊరి పేరుతో సినిమాలు కూడా వచ్చాయి.