హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం..

January 19, 2020

ncjgvngyujy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సేవల సంస్థ జోన్స్‌ ల్యాంగ్‌ లాసలె రూపొందించిన 2020 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరాల జాబితాలో హైదరాబాద్‌ అగ్రస్థానం సాధించింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పేరొందిన జోన్స్‌ ల్యాంగ్‌ లాసలె సంస్థ అధ్యయనం చేసింది. ఈ జాబితాలో బెంగళూరు రెండో స్థానంలో నిలవగా.. టాప్‌ 20 స్థానాల్లో ఏడు భారతీయ నగరాలు ఉన్నాయి.

ఈ సంస్థ రూపొందించిన ‘సిటీ మూమెంటమ్‌ ఇండెక్స్‌-2020’ని తెలంగాణ మంత్రి కేటీఆర్, జేఎల్‌ఎల్‌ సీఈవో రమేశ్‌ నాయర్‌, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌ శనివారం రాత్రి విడుదల చేశారు. డైనమిక్‌ నగరాల జాబితాలో మూడేళ్లలో రెండుసార్లు హైదరాబాద్‌ అగ్ర స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో హైదరాబాద్ నగరం 2015లో 20వస్థానం, 2016లో ఐదో స్థానం, 2017లో మూడో స్థానం, 2018లో మొదటి స్థానం, 2019లో రెండో స్థానంలో నిలిచింది. జేఎల్‌ఎల్‌ రూపొందించిన జాబితాలో భారత్‌ నుంచి స్థానం సంపాదించిన నగరాలు…హైదరాబాద్‌ (1), బెంగళూరు (2), చెన్నై(5), దిల్లీ(6), పుణె(12), కోల్‌కతా (16), ముంబయి (20) ఉన్నాయి. చైనా నుంచి షెన్‌జెన్‌(10), చోంగ్వింగ్‌(11), వుహాన్‌(13), హాంగ్‌ఝౌ(15), షాంఘై (17) ఐదు నగరాలు చేరాయి.