Hyderabad traffic department is accepting requests from the locals for setting up new U-turns and junctions
mictv telugu

మీరు ఎక్కడంటే అక్కడే యూటర్న్‌లు, జంక్షన్లు..

September 7, 2022

వాహనదారులు తాము కోరిన విధంగా ఆయా ప్రాంతాల్లో యూటర్న్‌లు, జంక్షన్లను ఏర్పాటు చేస్తే రాంగ్ రూట్‌లో ప్రయాణించరని, తద్వారా ట్రాఫిక్ రద్దీతో పాటు రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని చెబుతున్నారు సైబరాబాద్ పోలీసులు. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే ట్రాఫిక్‌ నిబంధనలను సక్రమంగా పాటిస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్‌లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

ఇప్పటివరకు యూటర్న్‌లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్‌ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్‌ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్‌ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్‌ పోలీసు అధికారి తెలిపారు. ఫ్లై ఓవర్‌పై ఉన్న రోడ్డు నిర్మాణం కూడా ప్రమాదానికి కారణమని చెప్పారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండకపోతే ప్రమాదాలు జరుగుతాయన్నారు.