పట్నం ప్రజలారా.. పారాహుషార్..! - MicTv.in - Telugu News
mictv telugu

పట్నం ప్రజలారా.. పారాహుషార్..!

November 21, 2017

హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపించే ట్రాఫిక్ సమస్యల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొండవీటి చేంతాడును మించిపోయే ట్రాఫిక్ జామ్‌లు, మధ్యమధ్య యాక్సిడెంట్లు, గుంటల్లో పడి నడుములు విరగ్గొట్టకోవడం మామూలే..!

ఇలాంటి కష్టాలు ఈ పది రోజుల్లో రెట్టింపు, ముట్టింపు, నట్టింపు(మూడురెట్లు, నాలుగు రెట్లు అన్నమాట) కానున్నాయి. ప్రముఖుల పర్యటనలు, అంతర్జాతీయ పెట్టుబళ్ల సదస్సు, మెట్రో రైలు ప్రారంభం, వేలాది పెళ్లిళ్లతో.. నగరం ట్రాఫిక్ సమస్యలతో మరిత చిత్తుకానుంది. నగర ప్రజలు ఈ పది రోజుల్లో కాస్త ప్రణాళిక ప్రకారం ప్రయాణాలు మొదలుపెట్టకపోతే తర్వాత ట్రాఫిక్‌లో చిక్కుకుని అలమటించాల్సిందే. ముఖ్యంగా బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మెహదీ పట్నం, బేగంపేట, అమీర్ పేట,  జూబ్లీహిల్స్, అబిడ్స్, కోఠి వంటి ప్రముఖులు తిరిగే ప్రాంతాల్లో జనం అప్రమత్తంగా ఉండాలి.

ఉపరాష్ట్రపతి పర్యటన

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తోంది. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద అరగంటకు పైగా వాహనాలను నిలిపేస్తున్నారు. చివరికి అంబులెన్సుల కూడా ముందుకు పోనివ్వడం లేదు. ముఖ్యంగా పర్యటనలో భాగంగా సాయంత్రంపూట రాకపోకలు నిర్వహిస్తుడడంతో జనం అల్లాడిపోతున్నారు.

పెళ్లిళ్లు..

ఈ నెల 23, 26 మధ్య తెలంగాణలో లక్షకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయి. దుస్తులు, ఆభరణాలు వంటి సామగ్రిని కొనుక్కోవడానికి జనం భారీగా భాగ్యనగరానికి పోటెత్తుతున్నారు. చాలామంది సొంత వాహనాల్లో వస్తున్నారు. దీంతోనగరంలో వాహనాల సంఖ్య పెరిగింది.

రెహమన్ మ్యూజిక్ షో

ఈ నెల 26న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గచ్చిబౌలిలో కచేరీ చేయనున్నాడు. దీనికి కూడా పెద్ద సంఖ్యలో ప్రముఖులు రానుండడంతో వారి వాహనాలు కూడా జనాన్ని ముప్పు తిప్పలు పెట్టనున్నాయి.

మెట్రో ఓపెనింగ్..

పెట్టుబడుల సదస్సు కోసం వస్తున్న మోదీ.. పనిలో పనిగా 28న మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఆయన వీవీఐపీ కనుక ట్రాఫిక్ ను నిలిపేస్తారు.

ఇవాంకాతో సమస్యలు..

పెట్టుబడుల సదస్సు కోసం వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా రాకకోసం హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే అందంగా అలంకరించారు. ఆమె రాకపోకలు సాగించే రోడ్లలో గుంతలు పూడ్చారు. జనం ఇప్పుడు కొన్ని చోట్ల హాయిగా వెళ్తున్నారు. అయితే సదస్సు జరిగే మూడు రోజుల్లో ఆమె తిరిగే రోడ్లలో ట్రాఫిక్ నిలిపేయనుండడం వల్ల జనం బండ్లకు బ్రేకులు పడాల్సిందే.

ఈ పర్యటనలే కాకుండా.. ఎప్పుడూ ఉండే గవర్నర్, సీఎం, మంత్రులు, ఇతర బడాబాబుల పర్యటనలు వీటికి అదనం. కనుక వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ వాసులతోపాటు నగరానికి వచ్చే వారు కూడా తమ షెడ్యూల్లో మార్పులు చేసుకుంటే బాగుంటుందని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.