రేపు 13 గంటలపాటు ఆంక్షలు, వేరే దారుల్లో వెళ్లాలి.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపు 13 గంటలపాటు ఆంక్షలు, వేరే దారుల్లో వెళ్లాలి..

September 11, 2019

Hyderabad traffic police..

గురువారం గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ మహానగరం సిద్దమైంది. పది రోజులపాటు భక్తుల పూజలు అందుకున్న గణేశుడు రేపు గంగమ్మ చెంతకు చేరనున్నాడు. నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అడిషనల్‌ సీపీ అనిల్‌ కుమార్‌ బుధవారం తెలిపారు. ‘ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. 11వ రోజున బాలాపూర్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. 17 ప్రధాన రహదారుల మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. 10వేల లారీలు దీనిలో పాల్గొంటాయి. అలిబాద్‌, నాగులచింత, చార్మినార్‌, మదీన, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా యాత్ర కొనసాగుతుంది. దీనికి అనుగుణంగా ట్రాఫిక్‌ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం’ అన్నారు.

అలాగే శోభాయాత్రలో ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి లేదన్నారు. ప్రతి ఒక్కరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగ్‌ కాలనీ, గోసేవ సధన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్‌ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్‌ స్టేడియం, పబ్లిక్ గార్డెన్‌ వంటి పది చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 6గంటల నుంచే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మొత్తం 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెళ్లేవారు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎమర్జెన్సీ వాహనాలు, అంబులెన్సులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహిస్తామన్నారు. రేపు గణేష్ నిమజ్జనం సందర్భంగా సెలవు దినం ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో, మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లాలకు ఉత్తర్వులు వర్తిస్తాయి. 12వ తేదికి బదులుగా 14 వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది.