సిటీ బస్సులో ప్రయాణం చేసే హైదరాబాద్ ప్రజలకు, పర్యాటకులకు గుడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికే టీ-24 టికెట్‌ను అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టీ-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్లకు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఈరోజు(శుక్రవారం) నుంచి కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని వివరించారు.
గురువారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో జరిగిన సజ్జనార్ మాట్లాడుతూ.. మహిళలు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం టీ-6 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. దీనిని రూ.50 చెల్లించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఆరు గంటల పాటు.. వారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే.. టీ-6 టికెట్ చెల్లుబాటు అవుతుందని , ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్‌ను బస్సుల్లో కండక్టర్‌లు ఇస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీ-6 టికెట్లను మంజూరు చేయరని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023
ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్24 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.300 చెల్లించి ఎఫ్24 టికెట్ కొనుగోలు చేస్తే ఆ టికెట్ పై నలుగురు వ్యక్తులు రోజంతా సిటీ ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రయాణం ఉచితం కాగా.. అంతకు పైబడిన వారు ఫ్యామిలీ-24 టికెట్ తీసుకోవచ్చని తెలిపారు. శని, ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో మాత్రమే ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇవి కూడా ఈరోజు(శుక్రవారం) నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.