3,726 పరీక్షల్లో 2,672 మందికి పాజిటివ్..ప్రైవేటు ల్యాబ్ పరీక్షల్లో.. - MicTv.in - Telugu News
mictv telugu

 3,726 పరీక్షల్లో 2,672 మందికి పాజిటివ్..ప్రైవేటు ల్యాబ్ పరీక్షల్లో..

July 4, 2020

Hyderabad Vijaya Diagnostic Center Corona Test

తెలంగాణలో కరోనా టెర్రర్ పుట్టిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు వస్తున్న పాజిటివ్ కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్‌లలో కూడా పరీక్షలు చేసుకునే అవకాశం కల్పించింది. దీనికోసం ప్రత్యేకంగా ధరలను కూడా కేటాయించింది. ఇక్కడే ప్రైవేటు ల్యాబ్‌ల పరీక్షలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు కొత్త చర్చకు దారి తీసింది. సేకరించిన శాంపిల్స్‌లో ఏకంగా 71 శాతం మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రభుత్వం ఆ ల్యాబ్ నిర్వహణపై సీరియస్ అయింది. అవి నిజమైనా ఫలితాలేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 

కరోనా పరీక్షల్లో భాగంగా ఇప్పటి వరకు విజయ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో 3,726 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వీరిలో ఏకంగా 2,672 మందికి పాజిటివ్ అని ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. అంటే 71.7 శాతం మందికి కరోనా అని తేలింది. దీనిపై ప్రభుత్వ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్కడ నిపుణులతో పర్యవేక్షించిన తర్వాతే ఆ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు ఎలాంటి పరీక్షలు చేయకూడదని చెప్పడంతో ల్యాబ్ మూసివేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే పరీక్షల కోసం 18 ప్రైవేటు ల్యాబ్ వారికి కూడా అనుమతి ఇవ్వడంతో కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు వచ్చాయి. నిన్న 1892 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,462కు చేరింది.