తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి వర్ష తీవ్రత మరింత పెరిగింది. తెరిపిలేకుండా కురుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో కుండపోత వర్షం కారణంగా నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మెట్రో రైలుకు సైతం ఆటంకం ఎదురవుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కార్లు, బైకులు నీటమునిగాయి. ఈ క్రమంలో విజయవాడ -హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడివారక్కడికి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. సురక్షితంగా వాళ్లను ఇళ్లకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ, ఏపీ జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతోంది. వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్లు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై భారీగా వరద ప్రవాహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కాగా, భారీ వర్షాలతో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం బలహీన పడిందని వాతావరణ శాఖ మంగళవారం రాత్రి తెలిపింది. రేపు మధ్యాహ్నం వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉందని.. హైదరాబాద్కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది.