Hyderabad Voters deciding Factor In Munugode Bypoll
mictv telugu

హైదరాబాద్ వైపు మునుగోడు చూపు

November 2, 2022

మరికొద్ది గంటల్లో మునుగోడు పోలింగ్. పార్టీలు, అభ్యర్థుల చూపు హైదరాబాద్ వైపు. నాన్ లోకల్స్ మునుగోడు నుంచి హైదరాబాద్ కు టెంట్ ఎత్తేశారు. ఇక్కడున్న ఓటర్లపై నజర్ పెట్టారు. మునుగోడు మొనగాడు ఎవరో తేల్చేది ఇక్కడోళ్లే. ప్రతిష్టాత్మక పోరులో హైదరాబాద్‌లో ఉంటున్న మునుగోడు వాసులు డిసైడింగ్ ఫ్యాక్టర్. వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా 25 వేల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి సక్సెస్ ఫుల్‌గా సాగే పోల్‌మేనేజ్‌మెంటే మునుగోడు అభ్యర్థిని గెలిపించబోతోంది.

సిటీ టు మునుగోడు

హైదరాబాద్‌లో 25 వేల మందికిపైగా మునుగోడు ఓటర్లు ఉన్నారు. ఒక్కో గ్రామం నుంచి 2 వందలకుపైగా ఓటర్లున్నారు. ఒక్క ఎల్బీ నగర్‌లోనే 8 వేల 5వందల మంది నివసిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ ,సరూర్ నగర్ , పెద్దఅంబర్‌పేట , హయత్ నగర్ , బీఎన్ రెడ్డి నగర్,వనస్థలిపురం, కర్మన్ ఘాట్‌లో అత్యధిక మంది ఉంటున్నారు వీరిలో ఎక్కువమంది 16 కంపెనీల్లో పనిచేస్తున్నారు. నగర శివారులోని ఒక్క ఫార్మా కంపెనీలోనే 5వేల మంది పనిచేస్తున్నారు. మునుగోడు అభ్యర్థి గెలుపు, ఓటముల్లో వీరి ఓట్లు కీలకం కానున్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న వారిపై మూడు పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. నెలక్రితం నుంచే వీరికి గాలం వేస్తున్నాయి. సమావేశాలు, విందులతో హోరెత్తించారు.

గులాబీ నజర్

నగరావాసులపై టీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ చేసింది. బ్లూ ప్రింట్ ప్రకారం నెలక్రితం నుంచే ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేస్తుంది. సిటీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని మునుగోడు రాకుండా ఇక్కడే ఉంచింది. అత్యధిక మందిని కలిసే విధంగా ప్లాన్ చేసింది. సమావేశాలు , విందులు,వినోదాలతో వారిని ఆకర్షించింది. హైదరాబాద్ నుంచి మునుగోడు తీసుకెళ్లెందుకు వాహనాల్ని సిద్ధం చేసింది. పికప్,డ్రాపింగ్‌తో పాటు సకల సౌకర్యాల్ని కల్పించబోతోంది. 25 వేల ఓట్లనే నమ్ముకున్న టీఆర్ఎస్..ఒక్క ఓటు చేజార్చుకోకూడదని భావిస్తోంది.

బీజేపీ స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో ఉన్న మునుగోడు ఓటర్లపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ చేసింది. వీరిని ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నించింది. టీఆర్ఎస్‌కు భిన్నంగా బూత్ లెవల్లో వీడదీసి ..ఆ పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. మునుగోడు రప్పించి ఓటేసేలా ఏర్పాట్లు చేసింది. సిటీలో కీలక నేతలు అత్యధిక మందిని కలిసేందుకు నెలరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడ్రస్సులు వెతికిమరి మునుగోడు ఓటర్లను కలిశారు.

ఎక్కడ ఎన్ని ఓట్లు అంటే…

మునుగోడు సెగ్మెంట్‌లో కొత్తగా ఎర్పాటైన గటుప్పల్ మండలం తేరట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 2211 ఓట్లు ఉన్నాయి. ఇందులో 5 వందల 20 మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. సంస్థాన్ నారాయపురం మండలం పుట్టపాకలో 3751 ఓట్లు ఉన్నాయి. ఇందులో 6 వందల మంది ఓటర్లు సిటీలో ఉంటున్నారు. ఒక్కో గ్రామం నుంచి దాదాపు 2వందల మంది హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. వీరిని గుర్తించిన పార్టీలు బ్యాచ్ లుగా వీడదీసి మునుగోడు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బ్యాచ్ కో బస్సు, ఇంచార్జ్‌ని కేటాయించాయి.

పోల్ మేనేజ్‌మెంట్ కీలకం

మునుగోడు మొనగాడు ఎవరో తేల్చేది హైదరాబాద్ వాసులే. 25 వేల ఓట్లు అంటే మామూలు విషయం కాదు. పోల్ మేనేజ్మెంట్‌లో
ఎవరు సక్సెస్ అయితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువ.హైదరాబాద్ నుంచి వాహనాల్లో వీరిని తీసుకెళ్లి..ఓటేసేదాకా సకల మర్యాదలు చేయాలి. అంతేకాదు ఓటేశాక మళ్లీ హైదరాబాద్ తిరిగి పంపిందేకు వాహనాలు పంపాలి. అప్పుడే ఏ పార్టీ టార్గెట్ అయినా రీచ్ అవుతాయి. దీనికోసం టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా పనిచేస్తున్నాయి.