అమెరికాలో హైదరాబాద్ మహిళ అనుమానస్పద మృతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో హైదరాబాద్ మహిళ అనుమానస్పద మృతి

October 7, 2019

Hyderabad Woman Ends Life in America

అమెరికాలో హైదరాబాద్ మహిళ అనుమానస్పద స్థితిలో మరణించింది. నాగోల్‌కు చెందిన గజం వనిత(38) ఆదివారం చనిపోయినట్లు  ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. భర్తనే ఆమెను హత్యచేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. రెండు నెలలుగా తమ కూతురు నుంచి తమకు ఎటువంటి ఫోనూ రాలేదని.. చివరికి ఇలాంటి వార్త వినాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వనితకు కొంత కాలం క్రితం రాచకొండ శివకుమార్‌తో వివాహం అయింది. అతడు నార్త్ కరోలినాలో ఉద్యోగం చేస్తుండటంతో ఇద్దరూ అక్కడే ఉండేవారు. వీరికి ఐదేళ్ల పాప కూడా పుట్టింది. తర్వాత కొంత కాలానికి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో కొన్ని రోజులు క్రితం ఆమె తన పుట్టింటికి వచ్చేసింది. చాలా రోజుల తర్వాత సర్థుకుపోమ్మని నచ్చజెప్పి వనితను మళ్లీ ఈ ఏడాది జులైలో కాపురానికి పంపించారు. అమెరికా వెళ్లిన తర్వాత కొంత కాలం తల్లిదండ్రులతో మాట్లాడిన ఆమె తర్వాత ఫోన్ చేయడం ఆపేసింది. 

శివకుమారే మొహంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు అమెరికాలోని ఆమె బంధువులు అనుమానిస్తున్నారు. వారి ఫిర్యాదుతో నార్త్‌ కరోలినా పోలీసులు శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వనిత మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు.