గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచేశాయి. కొన్ని లక్షల ఇళ్లలోకి వరద నీళ్లు వచ్చాయి. దీంతో లక్షల్లో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఈరోజు వర్షం తగ్గడంతో వరద పరిస్థితిని పరిశీలించడానికి వచ్చిన ప్రజాప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి స్థానిక మహిళ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యే అధికారులతో పాటు బోటులో వెళ్లి వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో రామాంతపూర్‌కు చెందిన మహిళలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడ్రోజుల నుంచి తమకు తిండి, నీళ్లు లేవని మండిపడ్డారు.
వరదలు వస్తాయని ప్రభుత్వం ముందే చెప్పదా అని నిలదీశారు. మాకు పునరావాసం ఎందుకు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సహనం కోల్పోయాడు. మిమ్మల్ని ఇక్కడ ఇల్లు ఎవరు కట్టుకోమన్నారని ఆ మహిళలను విమర్శించాడు. మీరు అనుమతి ఇస్తేనే కదా మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నామని ఆ మహిళ బదులిచ్చింది. అలాగే మీ పేరు రాసి చనిపోతామని ఆ మహిళలు ఎమ్మెల్యేతో అన్నారు. దాంతో ఈ వర్షం అకస్మాత్తుగా వచ్చిందని, దీనికి ఎవరూ ఏమీ చేయలేరని ఎమ్మెల్యే ముందుకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి ఓ మహిళతో ఇలాగేనా మాట్లాడేది నిలదీస్తున్నారు.