కరోనా పేరు వింటే జనం భయపడతారు. ఇప్పుడు సందట్లో సడేమియాగా భౌతిక దూరం గాలికి కొట్టుకుపోయినా వైరస్ భయం మాత్రం ఇంకా పోలేదు. ఎవరైనా తుమ్మితే ఇప్పుడూ ఆమడ దూరం పరిగెడుతున్నారు. అలాంటి కరోనా రోగులను ‘రండి రండి, దయచేయండి.. నా స్కూటర్‌పై మిమ్మల్ని ఆస్పత్రి దాకా తీసుకెళ్తా.. ’ అని లిఫ్ట్ ఆఫర్ చేస్తే? వినడానికే ధైర్యం చాలడం లేదు కదా. కానీ అలాంటి లిఫ్ట్ ఇస్తున్న మొనగాడు ఒకరు ఉన్నారు.
హైదరాబాద్‌లోని అమీర్ పేటకు చెందిన మహేందర్ రెడ్డి అనే యువకుడు ఇప్పటివరకు ఏకంగా 100 కరోనా పేషంట్లను ఆస్పత్రికి పట్టుకెళ్లాడు. కేవలం మానవతా దృక్పథంతో అతడు ఈ సేవ చేస్తున్నాడు. దీని వెనుక పెను విషాదం ఉంది. మహేందర్ రెడ్డి బిజినెస్ పార్టనర్ మీర్జా ఫయాజ్ కరోనాతో చనిపోయాడు. అతనికి సకాలంలో వైద్యం అందకపోవడం, సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం మహేందర్‌ను కలచివేసింది. తర్వాత మహేందర్, అతని కుటుంబ సభ్యులు కూడా కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చేరి పూర్తి కోలుకున్నారు. ‘కరోనా భయం వల్ల కొందరికి సాయం అందడం లేదు. కరోనా లక్షణాలుతో బాధపడుతున్నవారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అందకే నా వంతు సాయం చేస్తున్నా. ఏదో అవుతుందన్న సంగతి తర్వాత… ముందు మన ధైర్యంగా ఉండాలి.. ’ అని అతడు చెబుతున్నాడు. ఇంత సేవ చేస్తున్నా అతడు ప్రచారానికి పూర్తి దూరంగా ఉంటున్నాడు. మిత్రుల ద్వారా ఎవరైనా రిక్వెస్ట్ పెడితే వచ్చి ఆస్పత్రులకు తీసుకెళ్తుంటాడు.