హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి పాస్‌లు.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి పాస్‌లు..

March 25, 2020

nhhn

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశం మొత్తం 21రోజుల లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్స్ నిర్వాహకులు హాస్టల్స్‌లో ఉంటున్నవారిని ఖాళీ చేసి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్న యువతీ యువకులు ఆందోళనకు దిగారు. బస్సులు, రైళ్లు ఆగిపోయాయని, తామెలా ఊళ్లకు వెళ్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అటు ప్రభుత్వం, ఇటు హాస్టళ్ల యజమానులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో  ప్రైవేటు వాహనాల్లో, వీలైతే కాలినడకనైనా సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. 

ఇంటికి వెళ్లిపోవడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారంతా పోలీస్ స్టేషన్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు, బ్యాచిలర్ ఉద్యోగులు తమ సొంతూళ్లకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు దాదాపు రెండు వేల మంది యువతి యువకులు వచ్చారని అంచనా. అయితే పాసులు కావాల్సినవాళ్లు 100కి ఫోన్ చేస్తే పోలీసులే వచ్చి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.