తగ్గిన వాన.. ఇవాళ్టి నుంచి జూపార్క్ ఓపెన్ - MicTv.in - Telugu News
mictv telugu

తగ్గిన వాన.. ఇవాళ్టి నుంచి జూపార్క్ ఓపెన్

October 16, 2020

Hyderabad zoo to open from Friday..jp

అనుకోని ఉత్పాతం నగరాన్ని ముంచేసింది. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ ప్రజలు ఎంతో నష్టపోయారు. జిల్లాల్లోను వానలు పంటను నష్టపరిచాయి. నదులను తలపించిన వరదలతో నగరంలోని జూపార్క్‌లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు జూను అధికారులు మూసివేశారు. దీంతో జూలో సందర్శకులు లేక వెలవెలబోయింది. పర్యాటకులు సైతం నిరాశ చెందారు. అయితే, గురువారం వర్షం తగ్గడంతో జూపార్క్‌ను తిరిగి తెరవాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ జూ ఆవరణలో నిలిచిన వరద నీటిని తొలగిస్తున్నారు. 

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వాననీటిని ప్రధాన కాలువల ద్వారా బయటకు పంపేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయమై  జూ పార్క్‌ క్యూరేటర్‌ క్షితిజా మాట్లాడుతూ.. ‘జంతు ప్రదర్శనశాలను సందర్శకులు తిలకించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నాం. దీంతో శుక్రవారం నుంచి తిరిగి సందర్శకులకు, పర్యాటకులకు ప్రవేశాలు కల్పిస్తున్నాం. కరోనా వ్యాప్తి కారణంగా తగు నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ జూలోకి సందర్శకులను అనుమతిస్తాం’ అని ఆమె వెల్లడించారు.