ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు బరిలో మన దేశం నుంచి గుజరాతీ షార్ట్ ఫిలిం ‘చెల్లో షో’ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇదికాక రాజమౌళి ఆర్ఆర్ఆర్ మన దేశం నుంచి కాకుండా వేరే కేటగిరీల్లో ఆస్కార్ బరిలో నిలిచింది. సినిమాతో పాటు నాటు నాటు పాట కూడా బరిలో ఉంది. వీటితో పాటు పాకిస్తాన్ చిత్రం ‘జాయ్ ల్యాండ్’ అనే చిత్రం ఆ దేశం నుంచి నామినేట్ అయ్యింది. చెల్లో షో నామినేట్ అయిన విభాగంలోనే పాకిస్తాన్ చిత్రం కూడా నామినేట్ కావడం గమనార్హం.
అయితే ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాకిస్తానీ చిత్రానికి నిర్మాత హైదరాబాద్ కి చెందిన తెలుగమ్మాయి అపూర్వ చరణ్. హైదరాబాదులోనే పుట్టి పట్టిన అపూర్వ.. తర్వాత కుటుంబంతో అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ 20 కి పైగా షార్ట్ ఫిలింస్ నిర్మించగా, కథ, కథనం నచ్చడంతో జాయ్ ల్యాండ్ ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తొలిసారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించగా, స్టాండింగ్ ఒవేషన్ దక్కించుకుని విమర్శకులు ప్రశంసలు పొందింది. ఉత్తమ స్త్రీవాద చిత్రంగా జ్యూరీ మన్ననలు పొందింది. హీరో పాత్రధారి ట్రాన్స్ జెండర్ ని ప్రేమించడం సినిమా మూల కథ. దీంతో ఈ చిత్రంపై పాకిస్తాన్ లో ఆంక్షలు విధించారు. ఇస్లాం సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండడంతో కొన్ని సన్నివేశాలను తొలగించి విడుదల చేశారు. అయితే అంతర్జాతీయంగా ప్రశంసలు రావడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆస్కార్ కి పంపగా, అక్కడ షార్ట్ లిస్ట్ అయ్యింది. సైమ్ సాధిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలీ జునేజో, రస్తీ ఫరూక్, అలీనా ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి అవార్డు దక్కుతుందో లేదో చూడాలి. కాగా, మార్చిలో ఆస్కార్ విజేతలను ప్రకటిస్తారు.