తాజ్ కృష్ణ ఎదురుగా.. GHMC చుట్టం.. వచ్చి పట్టుకుపోండి! - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్ కృష్ణ ఎదురుగా.. GHMC చుట్టం.. వచ్చి పట్టుకుపోండి!

February 17, 2018

మహానగరం.. రేపోమాపో విశ్వనగరం.. స్వచ్ఛభారత్ అవార్డుల, రివార్డుల మోత మోగిస్తున్న పురం. ఆ నగరి నడిబొడ్డున  ప్రధాన రహదారి.. వీఐపీలు, సెలబ్రిటీలు నిత్యం చక్కర్లు కొట్టే  రోడ్డు.. అక్కడో పేరున్న ఫైవ్‌స్టార్ హోటల్.. సెలబ్రిటీలు, విదేశీయులు మరెందరో ప్రముఖులు బసచేసే ఆ హోటల్ ముందు ఓ బస్టాప్.. అక్కడ బీభత్స, భయానక దృశ్యం..! వాహనదారులను, పాదచారులను భయపెడుతూ ఒక పిచ్చివాడు..!  బవిరిగడ్డం, భీకరమైన చూపులు..! మీదపడి దాడి చేసేలా ఉగ్రరూపం..! బస్టాప్ బెంచీల కిందా, పైనా చుట్టుపక్కలా ఘోరమైన చెత్తాచెదారం.. మలమూత్రాలు, దుర్గంధం..!  కానీ ఎవరూ పట్టించుకోరు. అందరికీ ఆ పిచ్చివాడంటే భయం.. కానీ నగరపాలక సంస్థకు అతడొక ఆరాధ్య ప్రత్యక్ష సజీవ దైవం!  

ఈ నగరం, ఈ పిచ్చివాడు, ఈ చెత్త.. అన్నీ మన హైదరాబాద్ నగరంలోనివే! రోజూ లక్షలాది మంది ప్రయాణించే బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1లోని తాజ్ కృష్ణా హోటల్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో ఈ ఉన్మాది కొన్నాళ్లుగా తిష్టవేశాడు. బెంచీల కింద మురికి గుడ్డలనే హంసతూలికా తల్పంగా  మార్చుకుని హాయిగా కాపురం చేస్తున్నాడు.

ప్రజలకు ఉపయోగాపడాల్సిన బాస్టాప్‌ను బాహాటంగా కబ్జాచేసి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. నానా చెత్తాచెదారంతో ఆ ప్రాంతాన్ని నింపేసి దర్జాగా కులుకుతున్నాడు. ఎక్కడెక్కడో తెచ్చుకున్న తిండి తినేసి, పళ్ల తొక్కలు, అన్నం సంచులు, నానా కంగాళీ అంతా అక్కడే పడేస్తున్నాడు. కొన్నిసార్లు అవి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులపైనా పడుతున్నాయి. అయినా ఘనమైన బల్దియాకు చీమకుట్టినట్లయినా లేదు.

ఇతనికి మతిస్థిమితం లేదని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అయితే వేలు ఖర్చుచేసి కట్టిన బస్టాప్ ను అతడు ఆక్రమించుకోవడం, చెత్తకుండీగా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది అతని చుట్టుపక్కల ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారుగాని అతని ‘అడ్డా’ను ఏమాత్రం కదిలించలేకపోతున్నారు. దీంతో అతడు జీహెచ్ఎంసీ చుట్టం అని చుట్టుపక్కల వారు సటైర్లు వేస్తున్నారు. మొన్న ఇవాంకా పర్యటన సందర్భంగా నగరంలోని బిచ్చగాళ్లందర్నీ పట్టుకుపోయిన అధికారులు ఇతనిపై ఎందుకు మమకారం చూపుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. బిచ్చగాళ్ల ఆచూకీ చెబితే నగదు  బహుమానం అని ప్రకటించిన అధికారులు ఇతని సంగతేంటో చూడాలని కోరుతున్నారు..

ముప్పులెన్నో..

అతని చెత్త అడ్డాను వాడుకుని అసాంఘిక శక్తులు ఘాతుకాలకు తెగబడే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అడ్డా వల్ల ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత జీహెచ్ఎంసీ, పోలీసులదే..! తస్మాత్ జాగ్రత్త!