హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా?  - MicTv.in - Telugu News
mictv telugu

హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసా? 

April 9, 2020

hydroxyzine hydrochloride tablet making

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ గాని, ఇతర మందులుగానీ ప్రస్తుతానికి లేవు. ఈ మహమ్మారికి మందు కనిపెట్టడానికి ఇంకో ఏడాది సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మలేరియాకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మందు చాలా దేశాల్లో అందుబాటులో లేదు. దీంతో ఈ మందు అందుబాటులో ఉన్న దేశాల వైపు మిగతా దేశాలు చేతులు చాస్తున్నాయి. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఎగుమతి చేయాల్సిందిగా కోరుతున్నాయి. అగ్రదేశాలు కూడా ఈ మందును భారీ మొత్తంలో దిగుమతి చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి దేశాల చూపు భారత్‌పై పడింది. హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మందును భారత్ ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో మలేరియా జ్వరాలు పెద్దగా రావు గనుక ఆ దేశాల్లో ఈ మందుల నిల్వలు తక్కువ మోతాదులోనే ఉంటాయి. భారత్‌లో ఈ జ్వరాలు సర్వసాధారణంగా వస్తుండటంతో ఈ మందు నిల్వలు ఇతర దేశాలతో పోల్చితే పుష్కలంగా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం అన్ని దేశాల చూపు భారత్‌పై పడింది. 

హైడ్రాక్సీక్లోరోక్వీన్ తయారీ

సౌత్ అమెరికాలో మలేరియా జ్వరానికి విరుగుడుగా సిన్‌చోనా అనే చెట్టు బెరడును వాడుతారు. ఈ చెట్టు బెరడు నుంచి క్వినైన్ ను తయారుచేస్తారు. 1930 దశకంలో ప్రపంచ వ్యాప్తంగా మలేరియా విలయతాండవం చేసింది. దీంతో దీని అవసరం ఎక్కువైంది. ఈ క్వినైన్‌ను కృత్రిమంగా రసాయన పదార్థాలతో తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అపుడు క్లోరోక్విన్ అనే మాత్రలను తయారు చేశారు. ఈ మందు వల్ల కొన్ని దుష్ఫలితాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో 1950లలో క్లోరోక్విన్‌ను మరింత శుద్ధి చేసి దాని తయారీ విధానంలో మార్పులు చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను తయారుచేశారు. ప్రస్తుతం ఈ మందును మలేరియా, కీళ్లనొప్పులు, లూపస్‌ వంటి వ్యాధులకు ఉపయోగిస్తున్నారు.