బోనమెత్తిన టెక్కీలు..! - MicTv.in - Telugu News
mictv telugu

బోనమెత్తిన టెక్కీలు..!

July 4, 2017

నిత్యం కంప్యూటర్లతో కుస్తీ పట్టే చేతులు డప్పు చప్పుళ్లకు దరువేశాయి.ఎప్పుడూ డీజే సౌండ్స్ వినేవాళ్లు డిల్లెం-బల్లెం పాటకు ధూంధాంగా స్టెప్పులు వేశారు. మోడ్రన్ డ్రెస్సులతో మెరిసేపోయే మెరుపుతీగలు సంప్రదాయ దుస్తులు ధరించాయి. బోనమెత్తిన టెక్కీల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. బోనాల పండుగల్లో విదేశీయులు సైతం పాల్గొని తీన్ మార్ స్టెప్పులేశారు.

ఆషాడ మాసం వచ్చిదంటే ప్రతి ఆదివారం హైదరబాద్ లో పండుగే.ఎక్కడ చూసినా బోనాల సందడే..గల్లీ గల్లీలో తీన్ మాన్ డ్యాన్సులే. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మకు ప్రతి ఆదివారం బోనం సమర్పిస్తారు. ఈ జాతరలో భాగంగా మాదాపూర్‌లో టిటా ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారు.

ఐటీ కారిడార్‌లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. టిటా ఉద్యోగులతో పాటు విదేశీ మహిళలు బోనాలు ఎత్తుకున్నారు. గూగుల్ సంస్థ దగ్గర ఉన్న చిన్న పెద్దమ్మతల్లికి బోనం సమర్పించారు. నవ ధాన్యాలు ,పూలు, పండ్లతో పటం గీసి పూజలు చేశారు.

ఈ ఊరేగింపులో పాల్గొన్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ప్రభుత్వం బోనాల పండుగను నిర్వహిస్తోందన్నారు. 33 దేశాల్లోని తెలంగాణవాసులు బోనాల ఫెస్టివల్ జరుపుకుంటున్నారన్నారు. టిటా అధ్యక్షుడు సందీప్‌కుమార్ మాట్లాడుతూ బోనాలతో ప్రతి ఏడాది ఐటీ కారిడార్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుందన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ పెద్దయెత్తున పాల్గొంటారని చెప్పారు. ఈ ఊరేగింపులో జలసౌధ చైర్మన్ ప్రకాశ్, టీఎస్‌పీఎస్‌సీ సభ్యులు విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ఎప్పుడు మోడ్రన్ డ్రెస్సులతో కనిపించే టెక్కీలు చీరకట్టులో మెరిసిపోయారు. వారిని చూసి స్థానిక మహిళలు మురిసిపోయారు. విదేశీ మహిళలు తీన్ మార్ స్టెప్పులేయడం ఈ ఉత్సవాల్లో హైలైట్ గా నిలిచింది.