ప్రముఖ సినీ నటుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బంధువు అయిన మంచు మోహన్ బాబు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ మనిషినని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని బలంగా కోరుకునే వ్యక్తులలో ముందు వరుసలో ఉంటానని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో కోర్టు విచారణకు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలతో పాటు తాను రియల్ హీరోనని, విద్యార్ధుల ప్రయోజనాల కోసం పోరాడితే తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కాగా, 2019లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ధర్నా చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లపై కేసు నమోదు అయింది. మంగళవారం వారంతా కోర్టుకు హాజరుకానున్నారు.